Reading Time: 2 minutes
India Pakistan Asian Games 2026 Final Gold Medal Match Semifinal

India vs Pakistan: ఐచి-నాగోయా ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్‌ మధ్య ఫైనల్ ఫైట్ జరుగుతుందేమోననే ప్రచారం మొదలైంది. అయితే రెండు జట్లకూ సెమీఫైనల్ బెర్త్ దక్కిన తీరు మాత్రం అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే సెమీస్‌కు చేరుకున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 27) జరగాల్సిన పాకిస్థాన్‌ వర్సెస్ హాంకాంగ్, భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం వర్షం పడి మ్యాచ్ జరగకపోతే, మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్ ఉన్న జట్టే తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఆ లెక్కన టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగ్గా ఉన్న టీమిండియా, పాకిస్థాన్ నేరుగా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. నిజానికి అఫ్గానిస్తాన్‌తో జరిగే పోరుపై క్రికెట్ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉండేవి. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఏషియన్ గేమ్స్ మైదానంలో ఎలా ఆడతాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ భారీ వర్షం, తడిసిన అవుట్‌ఫీల్డ్ కారణంగా కనీసం టాస్ కూడా పడలేదు. దాంతో వైభవ్ సూర్యవంశీ ఆటను చూసే అవకాశం చేజారినట్లయింది.

ఇక టోర్నీ తదుపరి షెడ్యూల్ విషయానికి వస్తే, అక్టోబర్ 1 గురువారం రోజున ఇదే మైదానంలో సెమీఫైనల్స్ జరగనున్నాయి. శ్రీలంక, నేపాల్ మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ కూడా వర్షార్పణం కావడంతో, శ్రీలంక సెమీస్‌కు వచ్చింది. దీంతో రెండో సెమీఫైనల్‌లో భారత్, శ్రీలంకతో తలపడనుంది. మరోవైపు, అక్టోబర్ 1న ఉదయం 5:30 గంటలకే జరిగే మొదటి సెమీఫైనల్లో పాకిస్థాన్‌ ఆడనుంది. అయితే పాక్‌తో తలపడే జట్టు ఏదనేది సెప్టెంబర్ 29 ఉదయం 10:00 గంటలకు జరగబోయే బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ద్వారా తేలుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిస్తే, సెమీస్‌లో పాకిస్థాన్‌‌కు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం. ఆ మ్యాచ్ దాటుకుని పాక్ ముందుకు రావడం అనుకున్నంత తేలిక కాదు. మరోవైపు భారత్ కూడా శ్రీలంకను దాటి ఫైనల్‌కు చేరాల్సి ఉంటుంది. ఈ రెండు జట్లూ తమ తమ సెమీస్ గెలిస్తేనే మనందరం కోరుకునే భారత్-పాకిస్థాన్‌ గోల్డ్ మెడల్ ఫైట్ సాధ్యమవుతుంది. దీని తర్వాత టోర్నీలో మిగిలిన పతకాల పోరు అక్టోబర్ 3న జరుగుతుంది. ఉదయం 5:30 గంటలకు బ్రాంజ్ మెడల్ (కాంస్య పతకం) మ్యాచ్, ఉదయం 10:00 గంటలకు ఉత్కంఠభరితమైన ఫైనల్ (గోల్డ్ మెడల్) మ్యాచ్ జరగనున్నాయి. మొత్తానికి ఆసియా క్రికెట్ అభిమానులు ఆశిస్తున్న ఇండో-పాక్ సమరం జరుగుతుందో లేదో తెలియాలంటే మాత్రం ముందుగా సెమీఫైనల్స్ ముగియాల్సిందే!