Reading Time: 2 minutes
Mohammad Yousuf On Ms Dhoni Bcci Decision That Changed Indias Cricket

India vs Pakistan Cricket Comparison: 2007 వన్డే ప్రపంచ కప్ తర్వాత భారత్, పాకిస్థాన్ క్రికెట్ ప్రయాణాల్లో వచ్చిన మార్పులపై పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో భారత క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు టీమిండియా పురోగతికి దోహదపడ్డాయని.. ముఖ్యంగా ఎంఎస్ ధోనీని కెప్టెన్‌గా నియమించడం బీసీసీఐ తీసుకున్న బెస్ట్ నిర్ణయమని పేర్కొన్నాడు. అదే సమయంలో పాకిస్థాన్ క్రికెట్‌లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని యూసుఫ్ అభిప్రాయపడ్డాడు.

‘2007 వన్డే ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్థాన్‌ జట్లు రెండూ గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి. ఈ పరిణామం ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు కీలక మలుపుగా మారింది. ఆ తర్వాత భారత క్రికెట్ బోర్డు పలు అద్భుత నిర్ణయాలు తీసుకుంది. అందులో ఎంఎస్ ధోనీని కెప్టెన్‌గా నియమించడం ఒకటి. భారత్ తీసుకున్న నిర్ణయాలు జట్టు భవిష్యత్తును బలోపేతం చేశాయి. అందుకు భిన్నంగా పాకిస్థాన్‌లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మా జట్టు క్రికెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి’ అని మహ్మద్ యూసుఫ్ చెప్పుకొచ్చాడు.

‘భారత క్రికెట్ విజయాల్లో మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ పాత్ర కూడా కీలకం. జూనియర్ క్రికెట్ స్థాయిలో ప్రతిభను గుర్తించడం, ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో ద్రవిడ్‌ చేసిన కృషి ఇప్పుడు భారత జట్టుకు ఉపయోగపడుతోంది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను చిన్న వయసులోనే గుర్తించి వారికి సరైన మార్గనిర్దేశం చేయడం వల్ల భారత క్రికెట్‌కు ప్రయోజనం చేకూరింది. ప్రస్తుత తరం వైట్‌బాల్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. అతడు మైదానంలోకి దిగాడంటే పరుగులు అవే వస్తుంటాయి. జట్టును విజయతీరాలకు చేర్చేవరకు ఆగడు. అలాంటి ప్లేయర్ ప్రతి జట్టులో ఉండాలి’ అని మహ్మద్ యూసుఫ్ ప్రశంసించాడు.

2019 తర్వాత పాకిస్థాన్‌లో అత్యున్నత స్థాయిలో ఆధిపత్యం కొనసాగించేందుకు అవసరమైన స్థాయిలో ఆటగాళ్లు తయారుకాలేదని మహ్మద్ యూసుఫ్ అభిప్రాయపడ్డాడు. ‘నా దృష్టిలో ప్రస్తుత పాకిస్థాన్ ఆటగాళ్లలో కొందరు అదనపు సమయం కేటాయించి కష్టపడేందుకు ఆసక్తి చూపడం లేదు. పాకిస్థాన్ జట్టుకు నేను బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సమయంలో కొంతమంది ఆటగాళ్లు నేర్చుకోవడానికి కూడా ఆసక్తి చూపలేదు. క్రికెట్‌లో ఎంతకాలం ఆడినా ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవాల్సిందే. మాకు అన్నీ తెలుసని భావించే క్షణం నుంచే ఆటలో పతనం మొదలవుతుంది. ఆటగాళ్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కష్టపడాలి. కేవలం కోచ్‌లను తప్పుపట్టడం ద్వారా సమస్యలు పరిష్కారం కావు’ అని వ్యాఖ్యానించాడు.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ గురించి కూడా యూసుఫ్ మాట్లాడాడు. జట్టు ప్రయోజనాల కోసం సర్ఫరాజ్‌ ఎన్నో త్యాగాలు చేశాడని చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి రావాలని తాను సలహా ఇచ్చినప్పుడు కూడా జట్టు ఫలితమే తనకు ముఖ్యమని సర్ఫరాజ్ చెప్పిన విషయాన్ని యూసుఫ్ గుర్తుచేసుకున్నాడు. సర్ఫరాజ్‌ను పక్కన పెట్టిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్‌లో సమస్యలు మొదలయ్యాయని అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత తరచూ మార్పులు చోటుచేసుకోవడం కూడా జట్టుకు ఉపయోగపడలేదని పేర్కొన్నాడు.

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ బ్యాటింగ్‌లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని యూసుఫ్ పేర్కొన్నాడు. తాను బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో న్యూజిలాండ్‌లో బాబర్‌తో కలిసి ఆ అంశాలపై చర్చించానని, అయితే తన బ్యాటింగ్‌లో మార్పులు చేసుకోవడానికి అతను ఆసక్తి చూపలేదని యూసుఫ్ చెప్పాడు. సోషల్ మీడియా ఒత్తిడి ఆటగాళ్ల ప్రదర్శనకు కారణమనే వాదనను కూడా యూసుఫ్ తోసిపుచ్చాడు. భారత ఆటగాళ్లపై కూడా సోషల్ మీడియా ఒత్తిడి ఉంటుందని, అయినప్పటికీ వారు దానిని ఎలా ఎదుర్కొంటున్నారో ఆలోచించాలని ప్రశ్నించాడు. ఆటగాళ్లు కోచ్‌ల సూచనలను పాటించకపోతే కోచ్‌లు మాత్రం ఏం చేయగలరని ప్రశ్నించాడు. పాకిస్థాన్ క్రికెట్‌లో సీనియర్ ఆటగాళ్లు కోచ్‌ల మాట వినకపోవడం కూడా ఒక సమస్యగా మారిందని యూసుఫ్ పేర్కొన్నాడు.