
పోస్టాఫీసులో ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సేవలు అందిస్తోంది. లెటర్స్, పార్సిళ్లు, మనీ ఆర్డర్ లాంటి సేవలతో పాటు సేవింగ్స్ అకౌంట్ తెరవడం, పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టడం, ఇన్సూరెన్స్ లాంటి అనేక సేవలు పొందే అవకాశముంది. ఇక డీమ్యాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే ట్రైన్ టికెట్లను కూడా బుక్ చేసుకునే సదుపాయం కూడా పోస్టాఫీసుల్లో ఉంది. అవును.. కానీ ఈ విషయం చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. రిజర్వుడ్ టికెట్లతో పాటు తత్కా్ల్ టికెట్లను కూడా పోస్టాఫీసుల ద్వారా బుక్ చేసుకునే ఫెలిసిటీ ఉంది. రైల్వేశాఖతో కలిసి పోస్టల్ శాఖ ఈ సేవలను అందిస్తోంది.
కేవలం ఈ పోస్టాఫీసుల్లోనే ట్రైన్ టికెట్ల బుకింగ్..
కానీ అన్ని పోస్టాఫీసుల్లో ట్రైన్ టికెట్ల బుకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు, బుకింగ్ కౌంటర్లు అందుబాటులో ఉండవు. ఈ రైల్వే స్టేషన్ల పరిధిలోని పోస్టాఫీసుల్లో ట్రైన్ల టికెట్, తత్కాల్ టికెట్ బుకింగ్ సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్ సమీపంలోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ సౌకర్యం ఉండదు. కేవలం ఒకటి, రెండు పోస్టాఫీసుల్లోనే ఈ ఫెసిలిటీ ఉంటుంది. దీంతో ఏ పోస్టాఫీసులో ట్రైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం ఉందనేది ముందు తెలుసుకుని వెళ్లాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 333 పోస్టాఫీసుల్లో ట్రైన్ టికెట్, తత్కాల్ టికెట్ బుకింగ్ సదుపాయం అమల్లో ఉంది. రైల్వే స్టేషన్ రిజర్వేషన్ల కౌంటర్లలో ఉపయోగించి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌నే పోస్టాఫీసుల్లో కూడా ఉపయోగిస్తారు.
పోస్టాఫీసుల్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఎలా..?
ముందుగా మీ సమీపంలోని పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయా.. లేదా అనేది తెలుసుకోవాలి. అందుబాటులో ఉంటే.. పోస్టాఫీస్‌కు వెళితే ట్రైన్ టికెట్ బుకింగ్ ఫారం అందిస్తారు. ఆ ఫారంలో ప్రయాణికుల వివరాలు రాసి సమర్పించాలి. ప్రయాణికుల వివరాలు, స్టార్టింగ్, డెస్టినేషన్, డేట్, రైలు పేరు లేదా నెంబర్, క్లాస్ వివరాలు రాసి ఇవ్వాలి. అనంతరం పేమెంట్ చేయాలి. దీంతో పోస్టల్ సిబ్బంది బుకింగ్ చేసి టికెట్ మీకు అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ట్రైన్ టికెట్ల సులువుగా బుకింగ్ చేసుకునేలా రైల్వేశాఖతో కలిసి పోస్టల్ శాఖ ఈ సేవలు ఎప్పటినుంచో అందిస్తుంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. సాధారణ టికెట్లు మాత్రమే కాకుండా తత్కాల్ టికెట్లను కూడా పోస్టాఫీస్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.