
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ నగర కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతకు నిదర్శనంగా నిలుస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని అన్నారు. అందరి సహకారంతో గతేడాది నిర్వహించిన విజయవాడ ఉత్సవ్-1.0 అద్భుతంగా జరిగిందని, ఈ ఏడాది మరింత ఘనంగా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో ఆధ్యాత్మికతను, కృష్ణమ్మ ఒడ్డున ఆహ్లాదాన్ని అందించేలా విజయవాడ ఉత్సవ్‌ను తీర్చిదిద్దుతున్నామని చిన్ని పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు విజయవాడ ఉత్సవ్‌ను కూడా తిలకించాలని కోరారు. పున్నమి ఘాట్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ప్రాంగణాల్లో ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీలో నిర్వహించే జాతీయ సరస్ మేళాను ఈసారి విజయవాడకు తీసుకొచ్చామని, ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దసరా ఉత్సవాలు, జాతీయ సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్ కలయికతో నగరానికి వచ్చే ప్రజలకు ప్రత్యేక అనుభూతి కలుగుతుందని అన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులను ఉత్సవాలకు ఆహ్వానించాలని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానాలు పంపారని తెలిపారు. ఇటీవల ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశామని చెప్పారు.
విజయవాడ ఉత్సవ్ విజయవంతం కావడంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందిస్తున్న సహకారం అభినందనీయమని చిన్ని పేర్కొన్నారు. మూడు ఉత్సవాలకు ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంచి జ్ఞాపకాలతో తిరిగి వెళ్లాలని కోరారు. ఇదిలా ఉండగా, విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో విజయవాడ ఉత్సవ్ కర్టన్ రైజర్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వెనిగండ్ల రాము, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, కూటమి నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.