
పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను పూర్తి చేయడంతోపాటు నూతన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని ఎమ్మెల్యే శ్రీగణేశ్అధికారులకు సూచించారు. సోమవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) కమిషనర్ టి.వినయ్ కృష్ణా రెడ్డితో సమావేశమై, నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించారు.
కంటోన్మెంట్ పరిధిలోని 8 వార్డుల్లో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాళ్ల పూర్తి, అదనపు గదుల నిర్మాణం, రిపేర్లు, అత్యాధునిక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఎంఎంసీ నిధుల నుంచి ప్రభుత్వం రూ.8.50 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందన్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పనులను వేగవంతం చేయాలని కమిషనర్ ను కోరారు. మోండా డివిజన్‌లోని పలు సమస్యలతోపాటు నియోజకవర్గంలో చేపట్టాల్సిన ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనా కమిషనర్‌తో చర్చించానని, ఆయన సానుకూలంగా స్పందించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.