Reading Time: < 1 minute

మంచిర్యాల బస్టాండ్కు మహర్దశ…రూ.20 కోట్ల నిధులతో ఆధునికీకరణకు మోక్షం 

Caption of Image.

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల బస్టాండ్​కు మహర్దశ రానుంది. రూ.20 కోట్లతో ఆధునికీకరించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. వచ్చే ఏడాది జులైలో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి అన్ని హంగులతో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న బస్టాండ్​ను పూర్తిగా తొలగించి ఫ్లాట్ ఫామ్స్ సంఖ్య పెంచుతూ భారీగా విస్తరించనున్నారు. ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాల్స్, రెస్ట్ రూమ్స్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి సౌలత్​లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి ఆర్టీసీ ఈడీ రాజశేఖర్, కరీంనగర్ జోనల్ ఈడీ సోలోమన్, ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ విజయభాను, డిప్యూటీ ఆర్ఎంవో మల్లేశయ్య శనివారం బస్టాండ్, డిపోలను పరిశీలించారు. 

1975లో డిపో ఏర్పాటు

మంచిర్యాల బస్ డిపోను 1975 ఫిబ్రవరి 6న ఏర్పాటు చేశారు. బస్టాండ్​లో 9 ఫ్లాట్ ఫార్మ్స్, 32 బస్సులతో ప్రారంభించారు. డిపో 3.21 ఎకరాల్లో ఉండగా, 1.34 ఎకరాల్లో బస్టాండ్ నిర్మించారు. 1985 నాటికి బస్సుల సంఖ్యను 118కి పెంచారు. ప్రస్తుతం డిపో పరిధిలో 147 బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు రోజుకు సుమారు 62వేల కి.మీ. తిరుగుతుండగా, రూ.35 లక్షల ఆదాయం సమకూరుతోంది. 

ఇరుకు డిపోతో ఇబ్బందులు మంచిర్యాల బస్టాండ్​లో ఏటేటా ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నప్పటికీ.. ఇందుకు అనుగుణంగా విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 1985లో నిర్మించిన 9 ఫ్లాట్ ఫామ్స్ మినహా ఒక్కటి కూడా అదనంగా ఏర్పాటు చేయలేదు. దీంతో బస్సులు నిలిపేందుకు జాగ సరిపోవడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బస్​డిపోను వేరే ప్రదేశానికి తరలించి బస్టాండ్​ను విస్తరించాలని ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం 18 ఫ్లాట్​ఫామ్స్​తో బస్టాండ్ విస్తరణకు ముందుకు రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.