Reading Time: 2 minutes

తెలంగాణలో వారం రోజులు వానలే వానలు..ఈ 24 జిల్లాల వాళ్లు అలర్ట్

Caption of Image.

హైదరాబాద్:  మండుటెండలతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాలు రానున్న రోజుల్లో మరింత విస్తరించే అవకాశం ఉందని  తెలిపింది.  ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ అల్పపీడనం సెప్టెంబర్ 21న వాయుగుండంగా, సెప్టెంబర్ 22న తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం సెప్టెంబర్ 23 ఉదయం నాటికి దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

20 నుంచి 25 వరకు వర్షాలు

ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో సెప్టెంబర్ 20, 21, 22 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 24 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

ఈరోజు తెలంగాణలోని 24 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

రేపు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు మెరుపులు ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.