Reading Time: < 1 minute
Gummanur Jayaram Warns Rebels Ahead Of Local Body Polls

Gummanur Jayaram: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.. గెలుపు గుర్రాల వేటలో పడిపోయారు నేతలు.. అయితే, అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుత్తి, గుంతకల్లు మున్సిపాలిటీల్లో టీడీపీ జెండా ఎగరాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కానీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా రెబల్‌గా పోటీ చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ‘నేను రెబల్‌గా పోటీ చేస్తాను’ అంటే కుదరదు.. రెబల్‌గా వేస్తే సినిమా ఉంటుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీదే పైచేయి ఉంటుందని, ఎన్నికల పోరు వార్ వన్‌సైడ్‌గా ఉంటుందని ఎమ్మెల్యే జయరాం వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీల్లో పార్టీ బలోపేతానికి సమన్వయంతో ముందుకు సాగాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ‘ఒక్క టీడీపీ సినిమా మాత్రమే ఆడుతుంది’ అని జయరాం వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి అందరూ కృషి చేయాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో గుత్తి, గుంతకల్లు మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులపై ఆసక్తి ఉన్న ఆశావహుల నుంచి సమావేశంలో బయోడేటాలను స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, ఆశావహుల నుంచి వివరాలు సేకరించడం వంటి కార్యక్రమాలను టీడీపీ చేపట్టిన విషయం విదితమే..