గురువు సంకల్పం.. నరసాపురంలో శ్రీవైష్ణవ వైభవం.. ఈ పురాతన క్షేత్ర నిర్మాణ ప్రస్థానం 1786లో మొదలైంది. అప్పట్లో మద్రాసు లోని సెయింట్ జార్జ్ ఫోర్ట్‌లో బ్రిటిష్ ప్రభుత్వ ప్రధాన ద్విభాషిగా పనిచేస్తున్న ప్రసన్నాగ్రేశర శ్రీమాన్ పుప్పాల రమణప్ప నాయుడు సమాజంలో విశేష ప్రాబల్యం కలిగిన వ్యక్తి. శ్రీవైష్ణవ సంప్రదాయం పట్ల అపారమైన అనురక్తి కలిగిన ఆయన, ఉభయ వేదాంత పండితులైన శ్రీమాన్ ఈయుణ్ణి రామానుజాచార్యుల వద్ద ముముక్షుపడి, ద్రావిడ దివ్యప్రబంధాలను అధ్యయనం చేశారు.
ఆ కాలక్షేపం ముగిసిన వేళ, గురువుగారు ఒక ధర్మ సందేహాన్ని, సూచనను రమణప్ప నాయుడి ముందుంచారు. రామానుజాచార్యుల జన్మస్థలమైన భూతపురి (శ్రీపెరుంబూదూర్) దర్శనం అప్పట్లో ఆంధ్ర ప్రాంత భక్తులకు వ్యయప్రయాసలతో, సుదీర్ఘ కాలినడక లేదా బండ్ల ప్రయాణంతో కూడుకున్నదిగా ఉండేది. తెలుగు నేలపై నుంచే ఆ మహనీయుని దర్శించుకునేలా, శ్రీపెరుంబూదూర్ తరహాలోనే ఒక మహాక్షేత్రాన్ని నరసాపురంలో నిర్మించాలన్న గురువు ఆకాంక్షే ఈ ఆలయ ఆవిర్భావానికి పునాది వేసింది.
శ్రీపెరుంబూదూర్లో రెండేళ్ల తపస్సు.. ‘దస్రం’ లిఖిత గ్రంథం..కేవలం ఒక గుడి కట్టి విగ్రహాన్ని నిలపడం రమణప్ప నాయుడి లక్ష్యం కాదు. శ్రీపెరుంబూదూర్ సంప్రదాయం, నిత్యోత్సవాలు, పూజా కైంకర్యాలు ఇసుమంతైనా మారకుండా యథాతథంగా గోదావరి తీరాన ప్రతిష్ఠించాలనుకున్నారు. అందుకోసం ఆయన స్వయంగా శ్రీపెరుంబూదూర్ వెళ్లి సుమారు రెండేళ్ల పాటు అక్కడే మకాం వేశారు. అక్కడి పెద్దలు, అర్చకుల పర్యవేక్షణలో ప్రాతఃకాల ఆరాధన మొదలుకుని శయనోత్సవం దాకా జరిగే ప్రతి నిత్య, నైమిత్తిక విధులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయ నిర్వహణ విధివిధానాలన్నింటినీ ‘శ్రీపెరుంబూదూర్ దస్రం’ అనే విశిష్ట పీచు కాగిత గ్రంథంలో లిఖితపూర్వకంగా భద్రపరిచారు. ఈ నాటికీ ఆ సంప్రదాయ విధులే నరసాపురంలో శ్రద్ధగా కొనసాగుతున్నాయి.
ఆరు నెలల సమాసన దీక్ష.. నరసాపురానికి చేరిన రామానుజుల పాదుకలు..నరసాపురం ఆలయ మూలవిరాట్టు, ఉత్సవ విగ్రహాలు కూడా శ్రీపెరుంబూదూర్లోనే అత్యంత నిష్ఠతో రూపుదిద్దుకున్నాయి. రామానుజాచార్యులు స్వయంగా భూమిపై సంచరిస్తున్న కాలంలోనే శ్రీపెరుంబూదూర్ ఆలయంలో ప్రతిష్ఠించిన ప్రాచీన దివ్య మంగళ విగ్రహం పక్కనే, నరసాపురం కోసం మలచిన నూతన తిరుమేనిని సమాన ఆసనంపై ఉంచారు. ‘భద్రవేది’ లేదా ‘త్రివేది’ అని పిలిచే ఆ పీఠంపై సుమారు ఆరు నెలల పాటు నిరంతర ఆరాధనలు, మంత్రోచ్ఛారణలు సాగాయి.
ఆ చారిత్రక భద్రవేది పీఠం నేటికీ నరసాపురం ఆలయంలో భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీపెరుంబూదూర్ మూలవిగ్రహాన్నే గోదావరి తీరానికి తరలించాలన్న ఆలోచనతో రమణప్ప నాయుడు ప్రయత్నించగా, రామానుజాచార్యులు స్వప్న దర్శనమిచ్చి ఒక అద్భుత పరిష్కారాన్ని సూచించారనేది స్థలపురాణం. తన దివ్య శక్తులన్నింటినీ పాదుకల్లో నిక్షిప్తం చేశానని, వాటిని నరసాపురానికి తరలించి అర్చించాలని ఆదేశించారు. దాంతో నూతన విగ్రహాలతో పాటు ఆ పరమ పవిత్రమైన రామానుజ పాదుకలు నరసాపురానికి చేరాయి. శ్రీపెరుంబూదూర్ నుంచి విగ్రహాలను తరలించే క్రమంలో మార్గమధ్యంలో ఏ ఒక్క రోజూ ఆరాధన ఆగకుండా, శాస్త్రోక్తంగా కైంకర్యాలు నిర్వహిస్తూ గోదావరి తీరానికి తీసుకువచ్చారు.
రామానుజ చతుర్వేది మంగళం.. 15 కుటుంబాల అగ్రహారం.. ఆలయ నిర్మాణం పూర్తి కాగానే బాధ్యత తీరిపోలేదని రమణప్ప నాయుడు భావించారు. కైంకర్యాలు నిరాటంకంగా సాగేందుకు శ్రీపెరుంబూదూర్ నుంచి సుమారు 15 శ్రీవైష్ణవ పండిత కుటుంబాలను నరసాపురానికి రప్పించారు. వారు స్థిరపడేందుకు ఇళ్లు, వ్యవసాయ భూములు కేటాయించి ‘రామానుజ చతుర్వేది మంగళం’ పేరిట అగ్రహారాన్ని నిర్మించారు. ఆలయ నిర్వహణ, తిరువీధి ఉత్సవాలు, అన్నదానాల కోసం పుప్పాల వంశీయులు తమ సొంత ఆస్తి నుంచి సుమారు 150 ఎకరాల మాగాణి భూమిని, అపురూపమైన బంగారు, వెండి ఆభరణాలను సమర్పించారు. 1960వ దశకంలో ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వెళ్లినప్పటికీ, పుప్పాల కుటుంబీకులు వంశపారంపర్య ధర్మకర్తలుగా నేటికీ ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. భగవత్ రామానుజాచార్యుల అవతార ధామమైన ‘భూతపురి’ సంస్కృతిని, సంప్రదాయాన్ని, సాక్షాత్తూ ఆయన పాదుకా వైభవాన్ని తూచా తప్పకుండా ఒడిసిపట్టుకున్నందుకే నరసాపురానికి ‘అభినవ భూతపురి’ అనే సార్థక నామధేయం దక్కింది. సుమారు 240 ఏళ్లు గడిచినా, గోదావరి తీరాన శ్రీపెరుంబూదూర్ ఆధ్యాత్మిక వైభవాన్ని నిలుపుకుంటూ ఈ క్షేత్రం భక్తులకు శాంతిని, ముక్తిని ప్రసాదిస్తోంది.





