Reading Time: 2 minutes
Lion At Home Cat Overseas Sandeep Patil On Abhishek Sharma Vaibhav Sooryavanshi Batting

Sandeep Patil on Abhishek Sharma, Vaibhav Sooryavanshi: టీమిండియా యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ ఆల్‌రౌండర్, మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ ప్రశంసలు కురిపిస్తూనే కీలక సూచన చేశాడు. స్వదేశంలో అద్భుతంగా ఆడుతున్న ఈ ఇద్దరు.. విదేశాల్లో బంతి స్వింగ్ అవుతున్న పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఈ విషయం స్పష్టంగా కనిపించిందని గుర్తుచేశాడు. ఈ అంశంపై అభిషేక్, వైభవ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి తమ ఆటను మెరుగుపరుచుకోవాలని సూచించాడు. స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లిలా ఉండకూడని యువ ఆటగాళ్లను సందీప్ పాటిల్ హెచ్చరించారు.

స్వదేశంలో సింహాల్లా.. విదేశాల్లో పిల్లుల్లా ఉండకూడదు:

గత జులైలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ ఐదు మ్యాచ్‌ల్లో 131 పరుగులు చేయగా.. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ మూడు మ్యాచ్‌ల్లో 42 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో బంతి స్వింగ్ అవ్వడంతో ఇద్దరూ తమ సహజ శైలిలో బ్యాటింగ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని సందీప్ పాటిల్ ఎత్తిచూపారు. ‘అభిషేక్, వైభవ్ బ్యాటింగ్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. విదేశాల్లో బంతి కొంత స్వింగ్ అవుతుంటే ఈ ఇద్దరూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మనం చూశాం. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ఆ అంశంపై దృష్టి పెట్టి ఆటను మెరుగుపరుచుకోవాలి. స్వదేశంలో సింహాల్లా.. విదేశాల్లో పిల్లుల్లా ఉండకూడదు’ అని సందీప్ వ్యాఖ్యానించాడు.

రికార్డు సెంచరీ:

స్వదేశంలో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ దూకుడు బ్యాటింగ్‌ను సందీప్ పాటిల్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత జింబాబ్వేపై భారత్ 3-0తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఆ సిరీస్‌లో వైభవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌’గా నిలవడంతో పాటు చివరి మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కూడా అందుకున్నాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ భారత్ 3-0తో విజయం సాధించింది. సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 30 బంతుల్లోనే రికార్డు సెంచరీ బాదాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్‌పై కూడా సందీప్ స్పందించాడు.

నేనేమీ ఆశ్చర్యపోలేదు:

అభిషేక్ శర్మ సెంచరీ చేయడంపై నేనేమీ ఆశ్చర్యపోలేదు. అతడు బాగా ఆడాడు. అభిషేక్, సంజు శాంసన్ చెలరేగడంతో భారత జట్టు పవర్‌ప్లేలోనే 100 పరుగులు చేసింది. ఇది మళ్లీ ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. కానీ ఈ యువ ఆటగాళ్లకు క్రెడిట్ ఇవ్వాలి. ఆధునిక క్రికెట్‌లో వారికి స్వేచ్ఛగా ఆడే అవకాశం లభిస్తోంది. వారు దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటున్నారు. అభిషేక్, వైభవ్‌లలో అపారమైన పవర్, నైపుణ్యం, ప్రతిభ ఉన్నాయి. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇలా ఆడేందుకు గతంలో మేము ఆలోచించేవాళ్లం. కానీ ఈ తరం ఆటగాళ్లు తొలి బంతి నుంచే పూర్తి కమిట్‌మెంట్‌తో తమ షాట్లను ఆడుతున్నారు’ అని కొనియాడాడు. స్వదేశంలో చూపిస్తున్న దూకుడును విదేశీ పరిస్థితుల్లోనూ కొనసాగించాలంటే.. అభిషేక్, వైభవ్ తమ టెక్నిక్‌ను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నది పాటిల్ అబిప్రాయపడ్డాడు.