Reading Time: < 1 minute

డ్రగ్స్ రహిత సమాజంతోనే వికసిత భారత్..2029 నాటికి డ్రగ్స్ ఫ్రీ ఇండియా లక్ష్యం:  ఎంపీ లక్ష్మణ్‌‌

Caption of Image.
  • నెక్లెస్ రోడ్డులో ఘనంగా నశా ముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్ 

హైదరాబాద్, వెలుగు: మాదకద్రవ్యాలు లేని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంతోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్న వికసిత భారత్ సాధ్యమవుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం అక్షరస్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లోని నెక్లెస్ రోడ్ సైకిల్ స్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన నశా ముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్‌‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా పంజా విసురుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. మత్తు బారినపడి ఎన్నో పేద, మధ్యతరగతి కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ ద్వారా వచ్చే అక్రమ సొమ్మును దేశ వ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. దేశ సమగ్రతను దెబ్బతీసే ఇలాంటి ముఠాల నెట్‌‌వర్క్‌‌ను సమూలంగా కూల్చివేసేందుకు మోదీ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’విధానంతో ఉక్కుపాదం మోపుతోందని ఆయన తెలిపారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం.. 2029 నాటికి దేశాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం బలమైన నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేస్తోందని వివరించారు. ఇంటెలిజెన్స్ ఆధారిత దాడులు, సింథటిక్ డ్రగ్స్ మూలాల ఛేదన, డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా డిమాండ్ నియంత్రణ, దర్యాప్తు సంస్థల సమన్వయంతో మనీ ట్రయల్స్ గుట్టురట్టు చేయడం ద్వారా మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు.

హైదరాబాద్‌‌తో పాటు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్స్ ఈగల్ ఫోర్స్ అధికారి శ్రీనివాస్‌‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.