Reading Time: < 1 minute
Warangal: అయ్యో పాపం ఎంతటి ఘోరం.. చెల్లిని కాపాడబోయి అక్క కూడా..!

ములుగు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. కాశిందేవిపేట గ్రామ శివారులోని రహీంకుంట వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశిందేవిపేటకు చెందిన పదేళ్ల చిన్నారి ఆసియా రహీంకుంటను చూసేందుకు వెళ్లింది. కుంట వద్ద ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయింది. చెల్లి నీటిలో పడిపోవడాన్ని గమనించిన ఆమె అక్క ఎండి సాయ్యూన్ (18) వెంటనే చెల్లిని కాపాడేందుకు కుంటలోకి దూకింది. అయితే ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం అక్కాచెల్లెళ్ల మృతదేహాలను నీటికుంట నుంచి బయటకు తీశారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇద్దరు కుమార్తెలను ఒకేసారి కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు స్థానికులను కలచివేశాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను ములుగు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కాశిందేవిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..