Reading Time: 2 minutes
Off The Record About Revanth Reddy Vs Mahesh Kumar Goud Congress Candidate Debate

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ హాట్‌ హాట్‌గా నడుస్తోంది. ఆయన అంటే తప్పు, ఈయన అంటే ఒప్పా అంటూ… రకరకాల విశ్లేషణలు కూడా చేసేస్తున్నారు పార్టీ లీడర్స్‌. ఇంతకీ… మేటర్‌ ఏంటంటే…ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గ పర్యటనకు వెళ్ళారు. కాంగ్రెస్‌ పార్టీకే చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. ఆ పిలుపులో ఆయన ఉద్దేశ్యం ఏదైనాగానీ……దాని చుట్టూ పార్టీలో పెద్ద పంచాయితేనే నడిచింది. సహజమైన కాంగ్రెస్‌ కల్చర్‌కు భిన్నంగా ఈసారి కూడా ప్రకాష్‌రెడ్డే అభ్యర్థి అన్నట్టు సీఎం ఎలా ప్రకటిస్తారు, ఎలా పిలుపునిస్తారంటూ పెద్ద రచ్చే చేశారు. ఆ కథ రకరకాల మలుపులు తిరిగి ఏకంగా ఒక మంత్రిని బర్తరఫ్‌ చేసేదాకా వెళ్లింది. నిజమే కదా… సీఎం రేవంత్ ఇంత ముందుగా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారంటూ… కాంగ్రెస్‌ నేతలు కొందరు ప్రశ్నించారు కూడా. చివరికి PCC అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఆ ప్రశ్నలకు మద్దతు పలికేలా స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు…. ఎవరు ముందస్తుగా అభ్యర్ధుల్ని ప్రకటించినా… చెల్లదని కూడా తేల్చి చెప్పేశారు. పార్టీలోని రేవంత్ వ్యతిరేక వర్గానికి ఆ స్టేట్‌మెంట్‌ బలం ఇచ్చినట్టు అయింది. సీన్‌ అక్కడ కట్‌ చేస్తే…. తాజాగా మహేష్‌గౌడ్‌ నోటి నుంచే అదే తరహా మాటలు రావడం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది..

పిసిసి చీఫ్‌గా ఆయన బాధ్యతలు తీసుకుని రెండేళ్లు పూర్తయిన సందర్భంగా… మీడియాతో చిట్ చాట్ చేశారు మహేష్‌. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ చేస్తానని ఆ సందర్భంగా చెప్పారాయన. ఏ నియోజకవర్గం అన్నది తర్వాత చెబుతానన్నారు. సరే… ఆయనేదో క్యాజువల్‌గా అన్నారు, ప్రత్యేకించి ఫలానా నియోజకవర్గం అని కూడా చెప్పలేదు కాబట్టి…ఇప్పుడే అంత సీరియస్‌గా తీసుకుని చర్చ పెట్టాల్సిన అవసరం లేదని అనుకున్నారట పార్టీ లీడర్స్‌ అంతా. కానీ…పీసీసీ చీఫ్‌ ప్రకటన ఉమ్మడి నిజామాబాద్ కాంగ్రెస్‌లో అలజడి రేపింది. ఎందుకంటే… సొంత జిల్లా అయినా…. నిజామాబాద్‌లో మహేష్‌గౌడ్‌కు సొంత నియోజకవర్గం అంటూ ఏదీ లేదు. పైగా ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలో, లేదా పార్టీ ఇన్ఛార్జ్‌లో ఉన్నారు. ఎక్కడా ఖాళీ లేకపోవడంతో… పీసీసీ అధ్యక్షుడు వచ్చి ఎవరి సీటుకు ఎర్త్‌ పెడతారోనన్న టెన్షన్‌ జిల్లా నాయకుల్లో మొదలైంది. ఆ టెన్షన్‌లో నుంచే సరికొత్త డిస్కషన్‌ కూడా బయటికి వచ్చింది. మొన్న… పరకాలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేని తిరిగి గెలిపించమంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తే….రచ్చ చేసిన పీసీసీ చీఫ్… ఇప్పుడు తనకు తానుగా నేను పోటీ చేస్తానని ఎలా ప్రకటిస్తారంటూ లాజిక్ తీశారు జిల్లా లీడర్స్‌. ఇక పార్టీలోని రేవంత్‌ టీమ్ కూడా దీని గురించి అక్కడక్కడా చర్చ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఐతే…. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన మహేష్‌గౌడ్‌కు ఎప్పటి నుంచో ఉంది. ఆర్మూర్ నుంచి బరిలో దిగుతారన్న ప్రస్తావన కూడా వచ్చింది. ఇదే సమయంలో ఆయన తన మనసులోని మాట బయటపెట్టడం, అందుకు జిల్లాలో రియాక్షన్స్‌ తేడాగా ఉండటంతో…. హస్తంలో గరం గరం చర్చలు నడుస్తున్నాయి.