
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సమీపంలోని విజయనగర్ కాలనీలోని ప్రముఖ పెద్దమ్మ దేవాలయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి హుండీని ధ్వంసం చేసి, అందులో ఉన్న నగదును అపహరించారు.
ఉదయం ఆలయ సిబ్బంది, పంతులు వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు, క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు.
ఆలయం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, గత కొన్ని రోజులుగా హుండీ లెక్కింపు జరగకపోవడంతో.. చోరీకి గురైన మొత్తం ఎంతనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ALSO READ : సుప్రీంలో దానం నాగేందర్ పిటిషన్పై సెప్టెంబర్ 23న విచారణ
మరోవైపు, ఆలయ పరిసర ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకపోవడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో భద్రత కరవైందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు, నాంపల్లి పోలీసులు రాత్రి గస్తీని పెంచాలని స్థానికులు కోరుతున్నారు.