Reading Time: 2 minutes
Telangana: డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్.. మంజూరుకు లైన్ క్లియర్..

డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. హైదరాబాద్ పరిధిలో ఇళ్ల పంపిణీకి సిద్దమవుతోంది. 21 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులోగా లబ్దిదారులను ఎంపిక పూర్తి చేయాలని అధికారులను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. మధ్యలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. క్యూఆర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21 వేల డబుల్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. దీంతో వీటిని నగరంలోని పేదలకు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 30వ తేదీలోగా యుద్ద ప్రతిపాదికన లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. డ్రా విధానంలో లబ్దిదారుల ఎంపిక చేపట్టనున్నారు.

డ్రా పద్దతిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయింపు

డ్రాలో ఎంపికైన లబ్దిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉన్న 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేదలను గుర్తించి ఇళ్లను కేటాయించాలని సూచించారు. అంతేకాకుండా ఇళ్ల కాలనీల్లో విద్యుత్, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఇందుకోసం విద్యుత్, వాటర్ వర్క్స్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో ఉంటున్నవారిలో అనర్హులను గుర్తించి, ఆ ఇళ్లల్లో నివసించనివారికి నోటీసులు ఇచ్చిన రద్దు చేయాలని ఆదేశించారు. వారి స్థానంలో అర్హులైన వారికి ఎంపిక చేయాలని సూచించారు. ఇక ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ఇందిరమ్మ ఇళ్లను నగర పరిధిలో మంజూరు చేస్తున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. అర్హులను ఎంపిక చేసి ఇళ్ల మంజూరు పత్రాలను అందించనున్నట్లు స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

తాజాగా రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లతో పొంగులేటి వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యూఆర్ పరిధిలో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు కేటాయించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా నిలిపివేసిన డబుల్ బెడ్ రూం ఇళ్లను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు. తామెందుకు పూర్తి చేయాలన్న భేజజాలకు పోకుండా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని తెలిపారు. కాగా ఇప్పటికే నగరంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే డ్రా పద్దతిలో లబ్దిదారులను ఎంపిక చేసింది. త్వరలో నిర్మాణం పనులు కూడా మొదలుపెట్టనున్నారు. టెండర్లను కూడా ఖరారు చేయడం పూర్తి చేసింది. విడతల వారీగా నగరంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తుంది.