Reading Time: < 1 minute

కోరుట్లలో వినాయకుడి భజన పేరుతో ఆసుపత్రి పబ్లిసిటీ.. పైసలు తక్కువ తీస్కుంటరని, మంచి దవాఖాన అని పాటలు

Caption of Image.

జగిత్యాల జిల్లాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వినాయక భజన బాణీలో ఆసుపత్రి పబ్లిసిటీ చేసుకుంటూ కోరుట్లలోని ఒక ఆసుపత్రి ప్రవర్తించిన తీరు విమర్శలకు కారణమైంది. కోరుట్లలో ఒక ఆసుపత్రిలో ఆసుపత్రి యాజమాన్యం వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తుంది. 

మంచి విషయమే. కానీ.. వినాయకుని పూజలో భాగంగా ఆసుపత్రి గొప్పతనం చెప్పుకుంటూ భజన చేయడం ఆసుపత్రికి వచ్చిన రోగులను విస్మయానికి గురిచేసింది. భక్తి శ్రద్ధలతో చేయాల్సిన వినాయక పూజను ఆసుపత్రి పబ్లిసిటీ కోసం వాడుకోడటంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఆస్పత్రికి గొప్పతనాన్ని పొగుడుకుంటూ సిబ్బంది భజన చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి.

రానురాను వినాయక చవితి పండుగను చేసుకునే తీరు మారిపోతుంది. నిమజ్జనం సమయంలో కూడా సంబంధం లేని డీజే పాటలు, సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన బూతు డైలాగుల డీజే రీమిక్స్లతో గణనాథుడిని నిమజ్జనానికి తీసుకెళ్లడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్గ పోరులు, ఊళ్లో తగాదాలకు వినాయక చవితి పండుగను వేదికగా చేసుకుంటున్న జనం కూడా లేకపోలేదు.

ఇలాంటి ఘటనే మన తెలంగాణలో జరిగింది. నవరాత్రులు పూజలు అందుకోవాల్సిన గణనాథుడు ఇరువర్గాల గొడవతో ఎలాంటి పూజలు అందుకోకుండానే గంగమ్మ ఒడికి చేరాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌‌నగర్‌‌ నియోజకవర్గంలోని జిల్లేడు చౌదరిగూడ మండలం పీర్జాపూర్‌‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో గణేశ్​ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రోత్సవాలు నిర్వహించాలని కొందరు గ్రామస్తులు భావించారు.

అయితే హనుమాన్‌‌ దేవాలయంలో ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నందున ఆలయం వెలుపల వేరే చోట మండపం ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్‌‌ ఎర్రగుమ్ము నర్సింలుతో పాటు మరికొందరు సూచించారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. 

దీంతో చౌదరిగూడ పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆంజనేయస్వామి దేవాలయంలో ఎవరూ గణేశ్​ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని, వేరే చోట మండపం ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ఆదేశించారు. పోలీసుల నిర్ణయంతో ఓ వర్గం నిరాశకు గురైంది. అనంతరం వారు గణేశుడిని సోమవారం పండుగ రోజునే గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు.

©️ VIL Media Pvt Ltd.