Reading Time: 2 minutes
Odisha Hyderabad Dead Drop Drug Network Busted

డ్రగ్స్ విక్రయిస్తున్నాడనే పక్కా సమాచారంతో 27 ఏళ్ల సత్య అవినాష్‌పై నమోదు చేసిన కేసు, తెలంగాణలో ఓ భారీ అంతర్‌రాష్ట్ర డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు అవినాష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో ఈ ముఠా లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఒడిశాలోని కోరాపుట్ నుంచి బయలుదేరే ఈ డ్రగ్స్ గొలుసు, విజయనగరం జిల్లా పాచిపెంట మీదుగా రాజధాని హైదరాబాద్ వరకు విస్తరించినట్లు అధికారులు గుర్తించారు.

‘డెడ్ డ్రాప్’ విధానం.. గూగుల్ మ్యాప్స్‌తో డ్రగ్స్ సరఫరా!

ఈ ముఠా అత్యంత సాంకేతిక పద్ధతిలో డ్రగ్స్ వ్యాపారం సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. వాట్సాప్ వేదికగా ఆర్డర్లు స్వీకరించడం, ఫోన్‌పే ద్వారా నగదు బదిలీలు చేయించుకోవడం, ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ ద్వారా డ్రగ్స్ ఎక్కడ దాచారో ఆ ప్రాంతం లొకేషన్‌ను కస్టమర్లకు పంపడం వీరి శైలి. ఎవరికీ అనుమానం రాకుండా ‘డెడ్ డ్రాప్’ (నేరుగా కలవకుండా ఒక ప్రదేశంలో దాచిపెట్టి వెళ్లడం) పద్ధతిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై జూన్, జులై 2026 నెలల్లో మానవ నిఘా, సాంకేతిక ఆధారాలతో సమగ్ర దర్యాప్తు జరిపిన పోలీసులు.. 31 మంది క్యారియర్లు, వారికి సంబంధించిన కీలక ఆర్థిక లావాదేవీల లింకులతో పాటు సుమారు 230 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించి మొత్తం నెట్‌వర్క్‌ను మ్యాపింగ్ చేశారు.

అర్థరాత్రి మెరుపు దాడి.. కీలక సూత్రధారుల అరెస్ట్

సాంకేతిక ఆధారాలు పక్కాగా సేకరించిన అనంతరం, ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్, ఎచ్-న్యూ (HNEW) సిబ్బంది సంయుక్తంగా ఆగస్టు 12, 13 తేదీల మధ్య రాత్రివేళ భారీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ మెరుపు దాడిలో డ్రగ్ నెట్‌వర్క్‌ నడుపుతున్న ఐదుగురు కీలక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ మారి, కామేశ్ మారి, డంబు ఖోరా, అనసు ఖరా, సేథి రాకేష్‌లను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఒకరు జువెనైల్ (మైనర్) కాగా, అతడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.

వినియోగదారులపైనా కఠిన చర్యలు.. పునరావాసానికి ఏర్పాటు

కేవలం డ్రగ్స్ సరఫరా చేసేవారిపైనే కాకుండా, వాటిని ఉపయోగిస్తున్న వారిపైనా అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలోనే సుమారు 100 మంది డ్రగ్ వినియోగదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఎన్‌పీఎస్ (RNPS), ఈగల్ ఫోర్స్ , తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో క్రైమ్ నెంబర్ 16/2026 కింద కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న వారికి పరీక్షలు నిర్వహించగా, ఏకంగా 80 మందికి డ్రగ్స్ వాడినట్లు పాజిటివ్‌గా తేలింది. కాగా మేజిస్ట్రేట్ జోక్యంతో, డ్రగ్స్‌కు బానిసలైన వారిలో అర్హులైన వారికి డీ-అడిక్షన్ , పునరావాస చికిత్స అందించేందుకు పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.