
Jackfruit Biryani: మనలో చాలామందికి ఇష్టమైన ఫుడ్ ఏదంటే ఎక్కువ శాతం “బిర్యానీ” అని సంధానం చెబుతాం. శాకాహారులకు బిర్యానీ అంటే గుర్తొచ్చేది పనీర్, కాజు లేదా వెజ్ బిర్యానీ. అలాగే మాంసాహారులకు చికెన్, మటన్ బిర్యానీలు. కానీ శుభకార్యాల్లో, పెళ్లిళ్ల విందుల్లో చికెన్, మటన్ బిర్యానీలకు పోటీగా నిలిచే అసలైన శాకాహార వంటకం పనసకాయ బిర్యానీ (Jackfruit Biryani). పనసకాయ ముక్క, రుచి అచ్చం నాన్‌వెజ్ ముక్కల్లాగే మెత్తగా, జ్యూసీగా ఉండి చికెన్ బిర్యానీని తలపిస్తాయి. ప్రత్యేకంగా పక్కన ఎలాంటి గ్రేవీ లేదా సాలడ్ అవసరం లేకుండా.. సులభమైన పద్ధతిలో ఘుమఘుమలాడే పనసకాయ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు
పనసకాయ ఉడికించడానికి & మ్యారినేషన్ కోసం:
* లేత పనసకాయ ముక్కలు: అర కేజీ (500 గ్రాములు)
* పసుపు: పావు టీస్పూన్
* కారం: 1 టేబుల్ స్పూన్
* ఉప్పు: అర టేబుల్ స్పూన్
* నూనె: 1 టేబుల్ స్పూన్
* గట్టి పెరుగు: అర కప్పు
* నిమ్మరసం: 1 టీస్పూన్
బియ్యం ఉడికించడానికి (రైస్ ప్రాసెస్):
* బాస్మతి బియ్యం: 500 గ్రాములు (గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే 400 గ్రాములు సరిపోతుంది)
* నీరు: 2 నుండి 2.5 లీటర్లు
* బిర్యానీ మసాలాలు (చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు మొదలైనవి): 1 టేబుల్ స్పూన్
* పచ్చిమిర్చి: 2-3 (చీలికలు)
* కొత్తిమీర, పుదీనా తరుగు: కొద్దిగా
* ఉప్పు: 1 టేబుల్ స్పూన్
* నూనె: 1 టేబుల్ స్పూన్
బిర్యానీ గ్రేవీ & దమ్ కోసం:
* నూనె: 4 టేబుల్ స్పూన్లు
* నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
* గరం మసాలా: కొద్దిగా (చెక్క, మొగ్గ, యాలక్కాయ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు)
* జీడిపప్పు: 2 టేబుల్ స్పూన్లు
* ఉల్లిపాయ ముక్కలు: 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినవి)
* పచ్చిమిర్చి: 2 (చీలికలు)
* తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
* తాజా టమాటా ప్యూరీ: మూడో వంతు కప్పు (2 మీడియం టమాటాల పేస్ట్)
* బ్రౌన్ ఆనియన్స్ (వేయించిన ఉల్లిపాయలు): 1 కప్పు
* జీలకర్ర పొడి: అర టీస్పూన్
* ధనియాల పొడి: 2 టీస్పూన్లు
* బిర్యానీ మసాలా పొడి: 1 టీస్పూన్
* కుంకుమపువ్వు నీళ్లు (లేదా పసుపు నీళ్లు): 2 టేబుల్ స్పూన్లు
* కొత్తిమీర, పుదీనా: తగినంత
తయారీ విధానం
పనసకాయ ముక్కలు ఉడకడం
మార్కెట్ నుండి తెచ్చిన తాజా పనసకాయ ముక్కలను స్టవ్‌పై గిన్నెలో నీళ్లు పోసి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు పనసకాయ ముక్కలు వేసి మీడియం మంటపై కేవలం 5 నిమిషాలు ఉడికించాలి. ముక్కను చేత్తో నొక్కితే కాస్త మెత్తగా ఉంటే చాలు, మరీ మెత్తగా ఉడకనివ్వకూడదు. ఆ తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి ముక్కలను ప్లేట్‌లోకి తీసుకోవాలి.
మ్యారినేషన్ & బియ్యం నానబెట్టడం
ఉడికించిన ముక్కల్లో కారం, ఉప్పు, పావు చెంచా పసుపు, ఒక టేబుల్ స్పూన్ నూనె, పెరుగు, నిమ్మరసం వేసి ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా కలపాలి. దీనిపై మూతపెట్టి 15 నుండి 20 నిమిషాలు నాననివ్వాలి. ఈ లోపు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
రైస్ ప్రిపరేషన్
స్టవ్‌పై ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె, పచ్చిమిర్చి చీలికలు, హోల్ బిర్యానీ దినుసులు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి వేయించాలి. అందులోనే రెండున్నర లీటర్ల నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూతపెట్టి నీటిని బాగా తెర్లనివ్వాలి. నీళ్లు మరిగాక నానబెట్టిన బాస్మతి రైస్ వేసి మీడియం మంటపై 90% వరకు మాత్రమే ఉడికించి, వెంటనే గంజి వార్చేసి రైస్‌ను పక్కన పెట్టుకోవాలి.
బిర్యానీ మసాలా గ్రేవీ తయారీ
మందపాటి బిర్యానీ పాత్రను స్టవ్‌పై పెట్టి 3-4 స్పూన్ల నూనె, ఒక చెంచా నెయ్యి వేయాలి. వేడెక్కాక చెక్క, లవంగం, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఆపై సన్నని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, టమాటా ప్యూరీ వేసి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు, గుప్పెడు క్రష్ చేసిన బ్రౌన్ ఆనియన్స్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి బాగా కలిపి మీడియం మంటపై 3 నిమిషాలు మగ్గనివ్వాలి.
దమ్ ప్రాసెస్
పాత్రలోని పనసకాయ ముక్కల గ్రేవీని అడుగున సమానంగా సర్దాలి. దానిపైన 90% ఉడికించిన బాస్మతి రైస్‌ను రెండో లేయర్‌గా పరవాలి. పైభాగంలో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, చిటికెడు బిర్యానీ మసాలా, కొద్దిగా నెయ్యి, సాఫ్రాన్ వాటర్ చల్లుకోవాలి. రైస్ పైభాగం ఆవిరికి డ్రై అవ్వకుండా ఒక టిష్యూ పేపర్‌ను పరిచి దానిపై కాసిన్ని నీళ్లు చిలకరించాలి. పాత్రపై గట్టిగా మూతపెట్టి, మీడియం మంటపై 5 నిమిషాలు, ఆ తర్వాత లో ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు దమ్ చేయాలి.
ఫినిషింగ్
ఇలా మొత్తం 15 నిమిషాల దమ్ పూర్తయ్యాక స్టవ్ ఆపివేయాలి. వెంటనే మూత తెరవకుండా కనీసం 10 నిమిషాల పాటు గిన్నెను అలాగే వదిలేయాలి. అప్పుడే మసాలాల సువాసనలన్నీ అన్నానికి పడతాయి. ఆ తర్వాత మూత తీసి గరిటెతో కింద నుంచి పైకి మెల్లగా కలుపుకోవాలి. అంతే.. టేస్టీ పనస బిర్యానీ రెడీ.