
శబరిమలలో ప్రధాన ప్రసాదంగా అందించే ఆరవణ పాయసం ప్రత్యేకత గురించి తెలిసిందే.ఎవరైనా శబరిమల వెళ్తున్నారంటే ఆరవణ పాయసం తెమ్మని ఖచ్చితంగా అడుగుతారు. అంత క్రేజ్ ఉన్న ఆరవణ పాయసం ప్రసాదం కొరత కేరళ సర్కార్, ట్రావెన్ కొర్ దేవస్వం మధ్య విభేదాలకు దరి తీసింది. ఒక్కో భక్తునికి ఒక టిన్ మాత్రమే అమ్మలంటూ పరిమితి విధించడంపై దేవస్వం మంత్రి మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలం మకరవిళక్కు యాత్రా కాలానికి ముందు, రోజువారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 2.5 లక్షల టిన్ల నుండి 3.5 లక్షల టిన్లకు విస్తరించేందుకు చేపట్టిన 45 రోజుల ప్రాజెక్టే ఈ కొరతకు కారణమని బోర్డు పేర్కొంది. ఆ యాత్రా కాలంలో డిమాండ్ 4 నుంచి 4.5 లక్షల టిన్లకు చేరవచ్చని కూడా తెలిపింది. ఈ మేరకు కేరళ హైకోర్టుకు కూడా సమాచారం ఇచ్చామని పేర్కొంది బోర్డు.
ఆలయం మూసిన సమయంలో కానీ, భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాక కానీ మండలం మకరవిళక్కు ప్రాజెక్టు ప్రారంభించి ఉండాల్సిందని మంత్రి అభిప్రాయపడ్డారు. భక్తులకు ఇబ్బంది కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ కూర్చోదని.. ప్రయోగాల పేరుతో భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు.
ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లాలా లేదా అన్నది సీఎం వీడీ సతీసన్ తో కలిసి చర్చిస్తానని అన్నారు మంత్రి మురళీధరన్. రాబోయే యాత్రకాలాన్ని పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించే అంశంపై కూడా సీఎంతో చర్చిస్తానని అన్నారు.