Reading Time: 2 minutes
The Paradise Ticket Price Hike Telangana Special Premiere Show

The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా సెప్టెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రీమియర్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ ఆదివారం అధికారిక మెమో జారీ చేశారు. సినిమా నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం.. విడుదలకు ఒకరోజు ముందే ప్రీమియర్ షో నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి లభించింది. ఈ షోకు జీఎస్టీతో కలిపి ఒక్కో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. అదే విధంగా సెప్టెంబర్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించారు.

‘ది ప్యారడైజ్’ విడుదల నేపథ్యంలో తొలి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలకు అదనపు చార్జీలు వర్తించనున్నాయి. మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు టికెట్‌పై రూ.95 అదనపు చార్జీ వసూలు చేయనున్నారు. అలాగే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు రూ.45 అదనపు చార్జీ చేయనున్నారు. సింగిల్ స్క్రీన్స్‌ విషయానికి వస్తే సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు టికెట్‌పై రూ.48 అదనపు చార్జీ కాగా, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు రూ.23 అదనపు చార్జీ చేయనున్నారు. ఈ అదనపు మొత్తాల్లో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది. టికెట్ ధరల పెంపునకు అనుమతితో పాటు ప్రభుత్వం చిత్ర నిర్మాతలకు ఓ కీలక షరతు విధించింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీకి నిర్మాతలు తప్పనిసరిగా రూ.1 కోటి విరాళం అందించాలని ఆదేశించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఈ నిధులను సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు.

సినిమా ప్రదర్శన సమయంలో డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనలు థియేటర్లలో కచ్చితంగా అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత లైసెన్సింగ్ అధికారులకు హోంశాఖ సూచించింది. ఇక నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు మరో 4 రోజులే ఉండటంతో.. ప్రీమియర్ షో, పెరిగిన టికెట్ ధరలు, రోజుకు ఐదు షోల అనుమతితో థియేట్రికల్ రిలీజ్ మరింత ఆసక్తికరంగా మారింది.