
- ఎస్సారెస్పీ ప్రాజెక్టు సీఈతో మాట్లాడిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
- చలో చింతకుంట పేరిట బీజేపీ ఆందోళన.. లాఠీచార్జీ
కరీంనగర్/కొత్తపల్లి, వెలుగు: గణేశ్ నిమజ్జనం కోసం ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్‌కు సోమవారం నీటిని విడుదల చేశారు. నవరాత్రులు పూర్తి కావొస్తున్న సందర్భంగా విగ్రహాల నిమజ్జనం కోసం ఎస్సారెస్పీ నుంచి కాల్వలకు నీరు విడుదల చేయాలని ప్రాజెక్టు సీఈని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫోన్ చేసి కోరారు.
కొన్నేళ్లుగా గణేశ్ విగ్రహాలను కాకతీయ కాల్వలతో పాటు పలు డిస్ట్రిబ్యూటరీ కాల్వల్లో నిమజ్జనం చేసేవారని, కాలువలో నీరు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే విడుదల చేయాలని సీఈకి సూచించారు.
ఎమ్మెల్యే సూచన మేరకు నీటిని విడుదల చేస్తామని సీఈ తెలిపారు. అనంతరం ఉదయం 11 గంటలకు తొలుత 500 క్యూసెక్కులు, ఆ తర్వాత సాయంత్రం మరో 3 వేల క్యూసెక్కులు వదిలారు. కరీంనగర్ సిటీలో ఎక్కువగా వినాయకులను నిమజ్జనం చేసే చింతకుంట కెనాల్‌కు మంగళవారం రాత్రి వరకు జలాలు చేరనున్నాయి.
బీజేపీ ఆందోళన.. ఉద్రిక్తత
గణేశ్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ నుంచి కరీంనగర్జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సోమవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. చింతకుంట బ్రిడ్జిపై ధర్నాకు దిగిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఈ దాడిలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌పై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏసీపీ విజయకుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ ప్రవర్తించిన తీరుపై నాయకులు మండిపడ్డారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లకు నీటి విడుదలపై మంత్రులు వారం రోజులుగా మానిటరింగ్ చేస్తున్నారని, బీజేపీ ధర్నా చేసిన 5 నిమిషాల్లో ప్రభుత్వం నీటి విడుదలపై నిర్ణయం తీసుకున్నట్టు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. అనంతరం ఆయన చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.