
అమెరికాలో ప్రస్తుతం ట్రంప్ వర్సెస్ మీడియా వార్‌గా మారింది. తాజాగా అధ్యక్షుడు ట్రంప్.. మీడియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వార్తా సంస్థలు కేన్సర్ లాంటివని.. జాతీయ భద్రతకు ముప్పు అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పలు మీడియా సంస్థలను వైట్‌హౌస్‌లోకి రాకుండా అడ్డుకున్నారు.
మీడియాపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
సోమవారం ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్ స్పందిస్తూ.. తనపై విమర్శాత్మక కథనాలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలు అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారాయని ఆరోపించారు. వాటిని “ఫేక్ న్యూస్”, “కేన్సర్”గా అభివర్ణించారు. “ఇది మన జాతీయ భద్రతకు ముప్పు అని.. వెంటనే ఆపాలి” అని పేర్కొన్నారు. అంతకుముందు మూడు మీడియా సంస్థలను వైట్‌హౌస్‌లోకి అనుమతించకుండా నిషేధించారు. తమ జర్నలిస్టుల ప్రెస్ క్రెడెన్షియల్స్‌ను ఎలాంటి ముందస్తు నోటీసు లేదా తగిన ప్రక్రియ లేకుండానే రద్దు చేశారని CNN, MS NOW, Politico ఆరోపించాయి.
వైట్‌హౌస్ నిషేధాన్ని ప్రకటించిన సమయంలో ట్రంప్.. తన ప్రభుత్వం, అమెరికా అధ్యక్షుడిపై మీడియా సంస్థలు “ఫిక్షన్, అబద్ధాలు” ప్రచురించకూడదని అన్నారు. తన దృష్టిలో తప్పుడు వార్తలను ప్రచురించే సంస్థలకు వైట్‌హౌస్ యాక్సెస్ ఉండకూడదని వ్యాఖ్యానించారు. CNN, MS NOW, Politicoలను ఎందుకు నిషేధించారని ప్రశ్నించగా.. “వారు ఫేక్ న్యూస్” అని ట్రంప్ సమాధానమిచ్చారు. అయితే ఈ మూడు సంస్థలను ఎంచుకోవడానికి కారణమైన నిర్దిష్ట కథనం లేదా ఘటనను వైట్‌హౌస్ బహిరంగంగా వెల్లడించలేదు. భవిష్యత్తులో మరిన్ని మీడియా సంస్థలపై కూడా ఇలాంటి ఆంక్షలు ఉండొచ్చని ట్రంప్ హెచ్చరించారు.
కోర్టుకు మీడియా
తమపై విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ ఫెడరల్ కోర్టును ఆశ్రయిస్తున్నట్లు మూడు సంస్థలు సోమవారం సంయుక్తంగా ప్రకటించాయి. అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్‌మెంట్ ద్వారా కల్పించిన పత్రికా స్వేచ్ఛ హక్కులను కాపాడుకునేందుకే ఈ న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపాయి. ప్రభుత్వం.. ఏం రాయాలో, ఏం ప్రచురించాలో నిర్ణయించే పరిస్థితి ఉండకూడదని సంస్థలు పేర్కొన్నాయి. తమ కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకే జర్నలిస్టుల క్రెడెన్షియల్స్‌ను రద్దు చేశారని ఆరోపించాయి. వైట్‌హౌస్ నుంచి తమకు తిరిగి ప్రవేశం కల్పించేలా అత్యవసర న్యాయపరమైన జోక్యం కోరనున్నాయి.
జర్నలిస్టులను అడ్డుకున్న వైట్‌హౌస్
వారాంతంలో ఆంక్షలను అమలు చేశారు. CNNకు చెందిన సీనియర్ వైట్‌హౌస్ రిపోర్టర్ బెట్సీ క్లెయిన్, MS NOW రిపోర్టర్ అకైలా గార్డ్నర్ వైట్‌హౌస్ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు. Politico రిపోర్టర్ చెయెన్ హాస్లెట్ ప్రెస్ క్రెడెన్షియల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సంస్థలు తెలిపాయి. వైట్‌హౌస్‌లోకి ప్రవేశం నిరాకరించినప్పటికీ.. జర్నలిస్టులు బయట నుంచే తమ రిపోర్టింగ్‌ను కొనసాగించారు.
టీవీ పూల్ బాధ్యతపైనా ప్రభావం
CNNకు సోమవారం వైట్‌హౌస్ టెలివిజన్ పూల్ బాధ్యత కూడా షెడ్యూల్ అయి ఉంది. అధ్యక్షుడి కార్యక్రమాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను ఒక బ్రాడ్‌కాస్టర్ సేకరించి ఇతర టీవీ నెట్‌వర్క్‌లకు అందించే విధానాన్నే టీవీ పూల్ అంటారు. అయితే CNNకు బదులుగా మరో బ్యాకప్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వైట్‌హౌస్ ఆదివారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఈ కేసులో అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్‌మెంట్, పత్రికా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలకు సంబంధించిన డ్యూ ప్రాసెస్ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. తమ రిపోర్టింగ్‌పై అసంతృప్తితోనే ప్రభుత్వం చర్యలు తీసుకుందని మీడియా సంస్థలు ఆరోపిస్తున్నాయి.
వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ కూడా ఈ నిషేధాన్ని విమర్శించింది. ఒక సంస్థను దాని కథనాల కారణంగా మినహాయించేందుకు ఉపయోగించే ప్రమాణాలు భవిష్యత్తులో ఇతర మీడియా సంస్థలకూ వర్తించే ప్రమాదం ఉందని అధ్యక్షురాలు జాక్వి హెన్రిచ్ పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు అధికారంలో ఉన్నవారిని స్వతంత్ర మీడియా ద్వారా ప్రశ్నించే అవకాశం ఉండాలని ఆమె అన్నారు.
గతంలోనూ ట్రంప్-మీడియా మధ్య వివాదాలు
ట్రంప్ ప్రభుత్వానికి, అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలకు మధ్య గతంలోనూ అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ (AP)ను కొన్ని అధ్యక్ష కార్యక్రమాల నుంచి గతంలో నిషేధించారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు సంబంధించిన పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన వివాదం దీనికి కారణమైంది. AP ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసింది. ఇదే సమయంలో The New York Times, The Wall Street Journal, BBC వంటి ఇతర మీడియా సంస్థలతోనూ ట్రంప్ ప్రభుత్వం వివిధ న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొంది. ABCకి సంబంధించిన మరో వివాదం ప్రసార లైసెన్సింగ్ అంశం చుట్టూ కొనసాగింది. ప్రస్తుత వివాదంలో CNN, MS NOW, Politicoలను ఏకంగా వైట్‌హౌస్ ప్రాంగణంలోకి అనుమతించకపోవడం మరింత చర్చకు దారితీసింది. ఈ న్యాయపోరాటంలో కోర్టు వెలువరించే నిర్ణయం భవిష్యత్తులో ప్రభుత్వం, మీడియా సంస్థల మధ్య యాక్సెస్, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.