
కాయగూరలు తరిగేటప్పుడు చాలామంది బీరకాయ పొట్టు లేదా తొక్కను పనికిరానిదిగా భావించి చెత్తబుట్టలో పారేస్తుంటారు. కానీ, కొన్ని ప్రాంతంలో ఈ బీరకాయ తొక్కతో అద్భుతమైన, కారంగా ఉండే పచ్చడిని తయారు చేస్తారు. ఇది వ్యర్థాలను తగ్గించడమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది.
బీరకాయ తొక్కలోని ఆరోగ్య ప్రయోజనాలు:
బీరకాయ తొక్కలో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి మరియు బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో దోహదపడుతుంది. అంతేకాకుండా దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
కావలసిన పదార్థాలు:
బీరకాయ తొక్కలు – 1 కప్పు (శుభ్రంగా కడిగినవి)
పల్లీలు లేదా నువ్వులు – 2 చెంచాలు
మినపప్పు – 1 చెంచా
పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి – 4 నుండి 5
వెల్లుల్లి రెబ్బలు – 4
చింతపండు – చిన్న నిమ్మకాయ సైజు
బెల్లం – చిన్న ముక్క మీకు ఇష్టమైతే.
నూనె, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు – తాలింపుకు సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి పల్లీలు/నువ్వులు, మినపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరికొద్దిగా నూనె వేసి, శుభ్రం చేసిన బీరకాయ తొక్కలను వేసి పచ్చివాసన పోయి, మెత్తబడే వరకు 5-7 నిమిషాలు వేయించాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేయించిన దినుసులు, బీరకాయ తొక్కలు, చింతపండు, తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
చివరగా బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఇంగువతో తాలింపు వేసి పచ్చడిలో కలిపితే ఘుమఘుమలాడే బీరకాయ తొక్కు పచ్చడి సిద్ధమవుతుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే అమృతంలో ఉంటుంది. ఇడ్లీ, దోస, రొట్టెల్లోకి కూడా ఇది అద్భుతమైన కాంబినేషన్.