Reading Time: < 1 minute
Rvnl Bags 404 Crore Railway Project Share Price Details

నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) కు తూర్పు కోస్ట్ రైల్వే నుంచి భారీ ప్రాజెక్టు దక్కింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను కంపెనీ సెప్టెంబర్ 19న ఎక్స్ఛేంజ్‌కు అధికారికంగా తెలియజేసింది. జీఎస్టీతో కలిపి ఈ కాంట్రాక్ట్ మొత్తం విలువ రూ. 404.88 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్టు కింద నిరుగుండి-బారాంగ్, ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం వరకు సుమారు 385 కిలోమీటర్ల మేర మూడో లైన్ నిర్మాణ పనులను కంపెనీ చేపట్టాల్సి ఉంటుంది.

ఈ వర్క్ ఆర్డర్‌లో రోడ్‌బెడ్, చిన్న, పెద్ద వంతెనల నిర్మాణం, వంతెనల కింద రోడ్లు, బిల్డింగ్ పనులు, పర్మినెంట్ వే లింకింగ్, సబ్‌వేలతో పాటు ఇతర అనుబంధ పనులు ఉన్నాయి. ఈ మొత్తం నిర్మాణ పనులను కంపెనీ నిర్ణీత కాలపరిమితిలో అంటే 912 రోజుల్లోగా పూర్తి చేసివ్వాల్సి ఉంటుంది. ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేర్ల కదలికలపై ఇన్వెస్టర్ల దృష్టి నెలకొనే అవకాశం ఉంది.

గత వారపు చివరి ట్రేడింగ్ రోజున ఈ రైల్వే స్టాక్ సుమారు 4 శాతానికి పైగా లాభపడి రూ. 210.30 వద్ద ముగిసింది. స్వల్పకాలికంగా చూస్తే, గత ఒక నెలలో ఈ షేరు ధర 6.64 శాతం క్షీణించగా, మూడు నెలల్లో 15 శాతం, ఆరు నెలల్లో 23 శాతం చొప్పున పడిపోయింది. అలాగే గత ఒక సంవత్సరంలో ఈ షేర్లను హోల్డ్ చేసిన ఇన్వెస్టర్లు దాదాపు 42 శాతం వరకు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ఇదే సమయంలో సెన్సెక్స్ ఇండెక్స్ 10.50 శాతం నష్టపోగా, ఈ స్టాక్ మరింత క్షీణతను చవిచూసింది. ప్రస్తుతం ఈ కంపెనీ షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 400.90 వద్ద, కనిష్ట ధర రూ. 195.20 వద్ద నమోదైంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 42,847 కోట్లుగా ఉంది. గత రెండేళ్ల కాలంలో ఈ షేరు ధర 60 శాతం మేర పడిపోయినప్పటికీ, దీర్ఘకాలికంగా మాత్రం ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులను అందించింది. గత మూడేళ్లలో ఈ స్టాక్ 27 శాతం లాభాన్ని అందించగా, ఐదేళ్ల కాలంలో మాత్రం ఏకంగా 598 శాతం మేర భారీ లాభాలను పంచింది.