
CM Chandrababu: విశాఖ మహానగరంలో తీవ్ర తాగునీటి సంక్షోభం కొనసాగుతోంది. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ డేంజర్ మార్క్‌ను దాటడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నగరంలో నీటి సమస్య తీవ్రంగా మారింది. గ్రేటర్ విశాఖ పరిధిలో సుమారు 24 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించడం జీవీఎంసీకి సవాల్‌గా మారింది. చాలీచాలని నీటి సరఫరాతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలోనూ తాగునీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
కొన్ని ప్రాంతాల్లో కుళాయి నీరు పది నిమిషాలు కూడా రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. అదీ నిర్దిష్ట సమయానికి కాకుండా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేకపోవడంతో బోర్లు కూడా ఎండిపోయాయని స్థానికులు చెబుతున్నారు. గ్రేటర్ విశాఖలోని ఆరు నియోజకవర్గాల్లోనూ నీటి సమస్య తీవ్రంగా ఉందని.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలోనూ తాగునీటి కొరత వేధిస్తోందని పేర్కొన్నారు. దీనితో వెంటనే నీటి సరఫరాను మెరుగుపరచాలని సీఎం చంద్రబాబును ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు తాగునీటి సమస్యపై స్పందించారు. ఈ ఏడాది నీటి కొరత ఉందని అంగీకరించిన ఆయన.. వచ్చే ఏడాది నుంచి విశాఖ నగరానికి నీటి కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఏడాది విశాఖ ప్రజలకు తాగునీరు అందించలేమని ప్రభుత్వం చెబితే.. అసలు ప్రభుత్వం ఎందుకు ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. పెద్ద నగరంలో కనీసం తాగునీరు కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన విమర్శించారు. వర్షాకాలంలోనూ విశాఖలో ఈ స్థాయిలో నీటి సంక్షోభం ఎప్పుడూ చూడలేదని వైసీపీ నేతలు, నగరవాసులు పేర్కొంటున్నారు.