
టెహ్రాన్: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అయితే, ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక తేదీలు ఇంకా ఖరారు కాలేదు.
పెజెష్కియన్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించి యుద్ధం, కాల్పుల విరమణపై ఇరాన్ వైఖరిని వివరించనున్నట్లు సమాచారం. అలాగే, ఆయన ఇతర ప్రపంచ నాయకులతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి, ఈ సంఘర్షణపై ఇరాన్ వైఖరిని తెలిపి యుద్ధం ముగించడానికి వారి సహాయాన్ని కోరవచ్చని తెలుస్తోంది. పెజెష్కియన్‌తో పాటు అగ్రశ్రేణి పౌర, సైనిక అధికారులు సహా ఒక ప్రతినిధి బృందం కూడా వెళ్లనుంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ చమురు నౌకలపై అమెరికా దాడులు చేస్తోంది. ఈ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు స్వయంగా అమెరికా పర్యటనకు వెళ్లనుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సెప్టెంబర్ 22 నుంచి UNGA మీటింగ్ స్టార్ట్
2026, సెప్టెంబర్ 22 నుంచి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశం ప్రారంభం కానుంది. అమెరికా-ఇరాన్ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఐరాస ప్రధాన కార్యాలయ ఆతిథ్య దేశ నిబంధనల ప్రకారం ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీలతో కూడిన ప్రతినిధి బృందానికి అమెరికా పలు ఆంక్షలు విధిస్తూ వీసాలను మంజూరు చేసింది.
►ALSO READ | యుద్ధ చరిత్రలోనే బిగ్గెస్ట్ అటాక్.. రష్యాపై 1000 డ్రోన్లతో ఉక్రెయిన్ భీకర దాడి
న్యూయార్క్‌లో ఇరాన్ డెలిగేషన్పై కదలికలపై కఠినమైన ప్రయాణ ఆంక్షలు ఉంటాయని, లగ్జరీ వస్తువుల కొనుగోళ్లపై నిషేధం ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాలపై ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఇరాన్ వైఖరిని ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించనున్నారు.