Reading Time: 2 minutes

వినాయకుడు పాలు తాగుతున్నాడు కథకు 31 ఏళ్లు: సోషల్ మీడియా లేని రోజుల్లోనే వైరల్ ఎలా అయ్యింది..!

Caption of Image.

సరిగ్గా 31 ఏళ్ల క్రితం.. అంటే 1995 సెప్టెంబర్ 21న దేశవ్యాప్తంగా ఒక అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. ఆ రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన పిల్లలకు ఎప్పుడూ లంచ్‌ వడ్డించి, కబుర్లు చెప్పే ఆంటీలు కనిపించలేదు. ఎక్కడ చూసినా ఒకటే హడావుడి. ఆరా తీస్తే తెలిసిన విషయం ఏమిటంటే.. “వినాయకుడి విగ్రహాలు పాలు తాగుతున్నాయి, అందరూ అక్కడికి వెళ్లారు” అని. ఆ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు లేవు, వాట్సాప్ గ్రూప్‌లు లేవు, సోషల్ మీడియా అసలే లేదు. కేవలం ల్యాండ్‌లైన్ ఫోన్లు, నోటి మాట ద్వారా క్షణాల్లో దేశవ్యాప్తంగా పాకిన ఆ వార్త ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.

అప్పట్లో సమాచార వ్యవస్థ ఎలా ఉండేది?
1995 నాటి భారతదేశ సాంకేతిక పరిస్థితిని చూస్తే ఈ సంఘటన ఎంత ఆశ్చర్యకరమో అర్థమవుతుంది. ఆ సమయంలో దేశంలో ఇంటర్నెట్ సేవలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. 1995 ఆగస్టులో వీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా పబ్లిక్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో జనాభాలో కేవలం 0.026 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వాడేవారు అంటే ఆ సంఖ్య వేలల్లోనే ఉండేది. అలాగే టెలిఫోన్ సౌకర్యం కూడా చాలా పరిమితంగా ఉండేది. ప్రతి వంద మందికి కేవలం ఒక ల్యాండ్‌లైన్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. దూరదర్శన్‌తో పాటు జీ టీవీ, స్టార్ టీవీ వంటి కొన్ని ఛానెల్స్ ఉన్నప్పటికీ.. ఇప్పటి మాదిరిగా 24 గంటల ప్రసారాలు, బ్రేకింగ్ న్యూస్ కల్చర్ లేదు. వార్తలు తెలియడానికి మరుసటి రోజు ఉదయం వచ్చే న్యూస్ పేపర్లే ఆధారం.

దేశవ్యాప్తంగా పాలకు కొరత..
పరిమిత వనరులు ఉన్నప్పటికీ.. వినాయకుడు పాలు తాగుతున్నాడనే వార్త అప్పట్లో క్షణాల వ్యవధిలో దావానలంలా వ్యాపించింది. ముంబైలో మొదలైన ఈ అలజడి కేవలం గంటల వ్యవధిలోనే దేశంలోని నలుమూలలకు పాకింది. బాధితులు, భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు పరుగులు తీశారు. స్పూన్లతో పాలు తీసుకువెళ్లి వినాయకుడి విగ్రహాల ముందు ఉంచితే, ఆ పాలు అదృశ్యమవుతున్నాయని లక్షలాది మంది కళ్లారా చూశామని చెప్పారు. సెప్టెంబర్ 23 నాటికి పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే.. ఢిల్లీ సహా పలు నగరాల్లో మధ్యాహ్నానికల్లా షాపుల్లో పాలు పూర్తిగా అరిగిపోయి, తీవ్ర కొరత ఏర్పడింది.

సరిహద్దులు దాటిన వార్త..
ఈ అద్భుత సంఘటన కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ల్యాండ్‌లైన్ ఫోన్ కాల్స్, ఫ్యాక్స్ మెసేజ్‌ల ద్వారా ఈ వార్త బ్రిటన్, కెనడా, అమెరికా, నేపాల్‌లోని హిందూ సంఘాలకు కూడా చేరింది. విదేశాల్లోని భారతీయులు కూడా తమ స్థానిక ఆలయాల్లో పాలు పట్టి ఈ ప్రయోగాన్ని పరీక్షించారు. ఎలాంటి అల్గారిథమ్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు లేకపోయినా, కేవలం మానవ సంబంధాలు, బంధుత్వాలు, స్నేహాల ద్వారా ఈ సమాచారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు చేరడం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి.

ALSO READ : తిరుమల బ్రహ్మోత్సవాల్లో రష్యన్ భక్తుడు.. గోవిందా.. గోవిందా అంటూ శ్రీవారి నామస్మరణ

శాస్త్రవేత్తల మాట..
ఈ ఘటనపై శాస్త్రవేత్తలు, హేతువాదులు వెంటనే స్పందించారు. విగ్రహాల పదార్థం కారణంగా జరిగే ‘కేశనాళికా చర్య’, ‘ఉష్ణోగ్రత తలతన్యత’ వల్లే పాలు అదృశ్యమైనట్లుగా కనిపిస్తాయని శాస్త్రీయంగా వివరించారు. అయితే భక్తులు మాత్రం దీనిని ఒక దైవిక సంకేతంగా భావించారు. విజ్ఞాన శాస్త్రం ఒక కోణంలో దీనిని వివరించినప్పటికీ.. లక్షలాది మంది ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన ఒక సామాజిక సంఘటనగా ఇది చరిత్రలో నిలిచిపోయింది.

©️ VIL Media Pvt Ltd.