
Haribabu Murder Case: హరిబాబు హత్యకేసు నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సంతోష్‌ను రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వివరాలను వెల్లడించారు. వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే హరిబాబును సంతోష్ హత్య చేసినట్లు తెలిపారు. “ఈ నెల 17న నిజామాబాద్ లోని ఆర్‌ఆర్ చౌరస్తా వద్ద హత్య జరిగింది. తల్లి, బంధువుల సహకారంతో హరిబాబును సంతోష్ హత్య చేశాడు. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, రెండు కర్రలు, కారును స్వాధీనం చేసుకున్నాం. హత్యలో మిగతా నలుగురి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. సంతోష్‌తో పాటు అతడి తల్లి గంధం రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్ నేరాన్ని ప్రోత్సహించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.” అని వివరించారు. అయితే.. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలను సీపీ వివరించారు. హరిబాబును హత్య చేసిన అనంతరం సంతోష్ ఆంధ్రాకు పారిపోయేందుకు ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అతడిని ట్రేస్ చేసి నిజామాబాద్ బైపాస్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే బెయిల్‌పై బయటకి వచ్చిన హరిబాబు నిజామాబాద్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్న నిందితులు పక్కా ప్లాన్‌తో మర్డర్ చేశారని తెలిపారు.
అసలు ఏం జరిగింది?
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు.. తన భార్య వైష్ణవి (19)ని ప్రేమవివాహం చేసుకున్నాడు. కానీ.. మార్చి 17న ఆమె 4 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు గొంతు నులిమి, కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రెండ్రోజుల తర్వాత అరెస్టయి, ఆగస్టు 15న బెయిల్‌పై విడుదలైన హరిబాబు ప్రాణభయంతో అనంతపురంలో గణేష్ విగ్రహాల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు. బెయిల్‌పై బయటకొచ్చిన అతని తల్లి లక్ష్మి నిజామాబాద్‌లోని ఇంద్రాపూర్ కాలనీలో అద్దెకుంటూ రాజరాజేంద్ర చౌరస్తా వద్ద మొక్కజొన్నలు విక్రయిస్తోంది. తల్లిని చూడటానికి నిజామాబాద్ వచ్చిన హరిబాబు, గురువారం (సెప్టెంబర్ 17న) సాయంత్రం పానీపూరి బండి వద్ద నీళ్లు తాగుతుండగా వైష్ణవి సోదరుడు సంతోష్ కారులో వచ్చి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే తల, మెడ, నడుము భాగాల్లో 9 సార్లు కత్తితో దారుణంగా నరకడంతో హరిబాబు తీవ్ర రక్తస్రావమై తల్లి కళ్లముందే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ భయానక హత్య దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డై తీవ్ర వైరల్‌గా మారాయి. కళ్లెదుటే కొడుకును నరికి చంపడంతో తల్లి లక్ష్మి తీవ్ర షాక్‌లోకి వెళ్లిపోవడమే కాకుండా ప్రాణభయంతో వణికిపోతోంది. మార్చి 17న భర్త చేతిలో వైష్ణవి దారుణ హత్యకు గురైతే, సరిగ్గా ఆరు నెలల తర్వాత సెప్టెంబర్ 17న వైష్ణవి సోదరుడి చేతిలోనే హరిబాబు హత్యకు గురికావడం గమనార్హం.