
- సెల్‌ఫోన్లు, పశువులను దొంగతనం చేస్తున్న ముఠా గుట్టురట్టు
- గ్యాంగ్ లోని 12 మందిలో 9 మంది అరెస్ట్.. మరో ముగ్గురి కోసం గాలింపు
- నిందితుల నుంచి 22 లక్షల నగదు, 3 కార్లు, 15 ఫోన్లు స్వాధీనం
- కొట్టేసిన ఫోన్లను ముంబై మీదుగా నేపాల్, బంగ్లాదేశ్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠా
- కేసు వివరాలను మీడియాకు వివరించిన సీపీ సజ్జనార్
హైదరాబాద్, వెలుగు: దేశంలో చోరీ చేసిన సెల్‌ఫోన్లను విదేశాలకు తరలిస్తున్న ముఠాను హైదరాబాద్, ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై, బంగ్లాదేశ్ గ్యాంగ్స్‌తో కలిసి పనిచేస్తున్న ఈ 12 మంది ముఠాలో 9 మందిని సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.వీరి నుంచి రూ. 22 లక్షల నగదు, 3 కార్లు, 15 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కేసు వివరాలను శనివారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో జరిగిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ వెల్లడించారు.
మత్తు ఇంజక్షన్‌తో పశువుల చోరీ
లంగర్‌హౌజ్‌కు చెందిన మహ్మద్ తబ్రేజ్.. రంజాన్, బక్రీద్ పండుగల సమయంలో తన స్నేహితులతో కలిసి మొదట పశువుల దొంగతనాలకు పాల్పడేవాడు. ఎత్తుకెళ్లేటప్పుడు పాకల్లో మూగజీవాలు అరవకుండా వాటికి ‘జైలాజిన్’ అనే మత్తు ఇంజక్షన్ ఇచ్చేవారు. మత్తులోకి జారుకున్న పశువులను వాహనాల్లో తరలించి సంతల్లో తక్కువ ధరకు విక్రయించేవారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలతో పాటు ఫ్యూచర్ సిటీ పరిధిలో ఇలా 13 పశువుల చోరీలకు పాల్పడ్డాడు.
తాళాలు పగలగొట్టి షాపుల షట్టర్లు ఎత్తి చోరీలు చేసిన కేసుల్లో గతంలో జైలుకెళ్లిన తబ్రేజ్‌కు.. డ్రగ్స్ కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న కార్ల సెల్ఫ్-డ్రైవ్ వ్యాపారి అబూ అలియాస్ అఫ్జల్(ముంబై)తో పరిచయం ఏర్పడింది. అఫ్జల్ సహకారంతో తబ్రేజ్ దేశంలో ఎక్కడ చోరీకి వెళ్లినా ఇన్నోవా, ఎర్టిగా, బాలెనో వంటి సెల్ఫ్-డ్రైవ్ వాహనాలను సమకూర్చుకునేవాడు. ఈ గ్యాంగ్.. గత జూన్‌లో ఖమ్మంలోని ‘సోనోవిజన్’ మొబైల్ షాపులో వివిధ బ్రాండ్లకు చెందిన 160 ఫోన్లను ఎత్తుకెళ్లింది.
ఉజ్జయినిలో రెండు మొబైల్ షాపుల్లో చోరీ
ఖమ్మం చోరీ తర్వాత జూలైలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి వెళ్లి రెండు మొబైల్ షాపుల్లో తబ్రేజ్ గ్యాంగ్ చోరీలు చేసింది. గుజరాత్‌లో మరో చోరీకి ప్లాన్ చేస్తుండగా పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని గమనించి పారిపోయే కంగారులో వాళ్ల కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దాంతో ఆ కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఖమ్మంలో చోరీ చేసిన ఫోన్లను ముంబైకి చెందిన మహబూబ్ షేక్, ముబీన్ షేక్ ద్వారా మహ్మద్ జాహెద్ ఖాన్ అలియాస్ రాజా భాయ్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేశాడు. ముంబైలో భారీ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న జాహెద్ ఖాన్… నేపాల్, కోల్‌కతా మీదుగా బంగ్లాదేశ్ ఢాకాకు చెందిన ఖాసిమ్‌కు పార్శిల్స్ రూపంలో చోరీ ఫోన్లను పంపేవాడు. ఐఎంఈఐ నంబర్లు ట్రాక్ కాకుండా ‘కాలు’ అనే వ్యక్తి కీలకపాత్ర పోషించగా.. బంగ్లాదేశ్ చేరిన ఫోన్లు అక్కడి నుంచి జలమార్గాల ద్వారా చైనా సహా అంతర్జాతీయ మార్కెట్లకు చేరేవి. లావాదేవీలన్నీ హవాలా మార్గంలో జరిగేవి.
ఇలా దొరికారు..!
ఈ గ్యాంగ్ సభ్యులు హైదరాబాద్‌లో చోరీలు చేయడానికి కొత్తగా ఫోక్స్‌వ్యాగన్ వెంటో కారును సమకూర్చుకున్నారు. ఈ నెల17న ఈ వాహనంతో నగరంలో మరో నేరానికి పన్నాగం పన్నుతుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. తబ్రేజ్ సహా 9 మందిని అరెస్టు చేశారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా మొత్తం 53 కేసులు ఉండగా.. ప్రస్తుతం 17 కేసులను గుర్తించారు. పరారీలో ఉన్న అబూ అలియాస్ అఫ్జల్, ముంబైకి చెందిన కాలు, బంగ్లాదేశ్‌కు చెందిన ఖాసిమ్‌లో కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. చోరీకి గురైన సెల్‌ఫోన్లు ఎక్కడ వినియోగిస్తున్నారో ఐఎంఈఐ నంబర్ల ద్వారా ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.