Reading Time: 2 minutes
Iphone 18 Pro Max Charging Speed 55 Minutes 52w Fast Charging

iPhone 18 Pro Max: ఆపిల్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ స్పీడ్ విషయంలో పాత రికార్డులన్నీ తిరగరాస్తోంది. కంపెనీ తన ప్రో సిరీస్‌లోనే అత్యంత పెద్దదైన బ్యాటరీని ఈ మోడల్‌లో అందించింది. ఇందులో నానో సిమ్‌తో వచ్చే వెర్షన్‌లో 5,391mAh బ్యాటరీ ఉంటే, eSIM-ఓన్లీ వెర్షన్‌లో ఏకంగా 5,567mAh బ్యాటరీని ఇచ్చారు. బ్యాటరీ పెరిగినప్పటికీ, ఛార్జింగ్ టైమ్ మాత్రం చాలా తగ్గిపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. కంపెనీ చెబుతున్న దానికంటే చాలా వేగంగా ఇది ఛార్జ్ అవుతున్నట్లు ఇటీవల జరిగిన ఛార్జింగ్ టెస్ట్‌లో తేలింది.

ప్రముఖ టిప్‌స్టర్ ‘ఐస్ యూనివర్స్’ గుర్తించిన ‘షావోబాయ్స్ టెక్ రివ్యూస్’ అనే యూట్యూబ్ ఛానల్ టెస్టింగ్ ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో మాక్స్ కేవలం 55 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం వరకు ఫుల్ ఛార్జ్ అయిపోతోంది. గతేడాది వచ్చిన ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 81 నిమిషాల సమయం పట్టేది. దానితో పోలిస్తే ఇది చాలా ఫాస్ట్. ఈ కొత్త మోడల్ కేవలం 10 నిమిషాల్లోనే 34 శాతానికి, అలాగే 15 నిమిషాల్లో 50 శాతానికి చేరుకుంటుంది. అదే ఐఫోన్ 17 ప్రో సిరీస్‌లో 50 శాతం ఛార్జింగ్ ఎక్కడానికి 20 నిమిషాలు పట్టేది. ఈ టెస్ట్‌లో ఐఫోన్ 18 ప్రో మాక్స్ గరిష్టంగా 52W ఛార్జింగ్ స్పీడ్‌ని అందుకని అందరినీ ఆశ్చర్యపరిచింది. కాకపోతే ఈ పీక్ స్పీడ్ దాదాపు 12 నిమిషాల పాటు మాత్రమే కొనసాగింది.

ఆపిల్ అధికారిక సమాచారం ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్ మోడల్స్ అడ్జస్టబుల్ వోల్టేజ్ సప్లై (AVS) సపోర్ట్ చేసే 60W లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అడాప్టర్‌తో 15 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జ్ అవుతాయి. దీనికోసం ఆపిల్ కొత్తగా తీసుకొచ్చిన ’40W డైనమిక్ పవర్ అడాప్టర్’ ఉపయోగపడుతుంది. ఇది ఇండియాలో రూ. 4,490 ధరకు అందుబాటులోకి వచ్చింది. సింగిల్ టైప్-సి పోర్ట్ తో వచ్చే ఈ అడాప్టర్ గరిష్టంగా 60W వరకు అవుట్‌పుట్ ఇస్తుంది. ఇక మాగ్‌సేఫ్ ఛార్జర్‌తో పాటు 35W లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అడాప్టర్ వాడితే 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. రెండు టైప్-సి పోర్ట్‌లు ఉండే ఆపిల్ 35W డ్యూయల్ పోర్ట్ అడాప్టర్ ధర ఇండియాలో రూ. 5,800గా ఉంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఛార్జింగ్ అడాప్టర్లని ఆపిల్ ఫోన్‌తో పాటు ఉచితంగా ఇవ్వదు, విడిగా కొనుక్కోవాల్సిందే.