
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దత్తిరాజేరు మండలం కోమటపల్లి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లోడ్ లారీ, టిప్పర్ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు టిప్పర్ కేబిన్‌లో డ్రైవర్, క్లీనర్ చిక్కుకుపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ప్రమాదం ధాటికి టిప్పర్ కేబిన్ నుజ్జునుజ్జు కావడంతో అందులో చిక్కుకున్న వారు బయటకు రాలేక ఆర్తనాదాలు చేశారు. తమను కాపాడాలంటూ బాధితులు చేసిన కేకలతో ఘటనాస్థలిలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కేబిన్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రత్యేక పరికరాలతో సుమారు నాలుగు గంటల పాటు సహాయక చర్యలు కొనసాగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని బయటకు తీసిన అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొనడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..