
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు తన అద్భుతమైన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా, తన తొలి లీగ్ మ్యాచ్‌లో జపాన్ జట్టుతో తలపడింది. ఆట ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు, జపాన్‌ను 49-24 అనే భారీ స్కోరు తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో ఏషియన్ గేమ్స్ చరిత్రలో జపాన్‌పై భారత్‌కు ఇది ఏకంగా ఎనిమిదో విజయం కావడం విశేషం. ఇప్పటివరకు ఏషియన్ గేమ్స్ వేదికగా జపాన్ జట్టు ఒక్కసారి కూడా ఓడించలేకపోవడం గమనార్హం.
మొదటి హాఫ్‌లో చెలరేగిన భారత ఆటగాళ్ళు
మ్యాచ్ ప్రారంభమైన మొదటి హాఫ్‌లోనే భారత రైడర్లు, డిఫెండర్లు అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. అస్లామ్ ఇనామ్‌దార్, ఆశు మాలిక్, అయాన్ లోచబ్ తమ అటాకింగ్ గేమ్‌తో జపాన్ డిఫెన్స్‌ను పూర్తిగా భయపెట్టారు. ముఖ్యంగా అయాన్ లోచబ్, దేవాంక్ దలాల్ తమ తొలి ఏషియన్ గేమ్స్ మ్యాచ్‌లోనే అదరగొట్టారు. తొలి హాఫ్ ముగిసే సమయానికి భారత్ ఏకంగా 31-9 పాయింట్ల భారీ ఆధిక్యాన్ని సంపాదించుకుంది. జపాన్ జట్టు భారత దూకుడు ముందు నిలవలేక పూర్తిగా డిఫెన్సివ్‌లోకి వెళ్లిపోయింది.
రెండో హాఫ్‌లోనూ కొనసాగిన జోరు
తొలి హాఫ్‌తో పోలిస్తే రెండో హాఫ్‌లో జపాన్ జట్టు కొద్దిగా పుంజుకుని 15 పాయింట్లు సాధించింది. అయినప్పటికీ భారత జట్టు పట్టుసడలించకుండా తన జోరును కొనసాగించింది. రెండో హాఫ్‌లోనూ టీమిండియా మరో 18 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. స్టార్ ఆటగాడు పవన్ సెహ్రావత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, మరో ఎండ్‌లో అస్లామ్ ఇనామ్‌దార్ జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా మ్యాచ్‌లో భారత్ ఎనిమిది ఆల్-అవుట్ పాయింట్లు, రెండుసార్లు సూపర్ ట్యాకిల్స్ సాధించి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.
తదుపరి మ్యాచ్ ఎప్పుడంటే ?
ఏషియన్ గేమ్స్ చరిత్రను పరిశీలిస్తే.. కబడ్డీ క్రీడలో భారత్ అత్యంత శక్తివంతమైన జట్లలో ఒకటిగా ఉంది. ఇప్పటివరకు నిర్వహించిన 9 ఏషియన్ గేమ్స్‌లో 8 సార్లు భారత పురుషుల జట్టే గోల్డ్ మెడల్ సాధించింది. కేవలం 2018 టోర్నమెంట్‌లో మాత్రమే భారత్ పసిడి పతకం కోల్పోయింది. ఇప్పుడు తొమ్మిదో బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా, తన తదుపరి మ్యాచ్‌లో మంగళవారం రోజున సౌత్ కొరియా జట్టుతో తలపడనుంది. ఈ విజయంతో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..