
హైదరాబాద్: మాజీ ఏసీపీ ఎ.కృష్ణయ్యకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఆయనకు నెల రోజుల కఠిన కారగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు హైకోర్టు జస్టిస్ కే.సుజన శుక్రవారం (సెప్టెంబర్ 18) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, జడ్జిమెంట్‌పై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా కోర్టు ఆయనకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. అప్పటి వరకు తీర్పును సస్పెండ్ చేసింది.
అసలేం జరిగిందంటే..?
వ్యాపారవేత్త కట్టా వంశీ కృష్ణపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో వరకట్న హత్య కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అప్పటి ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ వంశీ కృష్ణ హైకోర్టును ఆశ్రయించాడు.
పోలీసులు తనను నిరంతరం వేధిస్తున్నారని, హైకోర్టు ఉత్తర్వుల గురించి చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని, కేసు రికార్డులలో తనను పరారీలో ఉన్నట్లు తప్పుగా చూపించారని నిందితుడు పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు జస్టిస్ కే.సుజన
ఏసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏసీపీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినట్లు నిర్ధారిస్తూ అతడికి నెలరోజుల పాటు కఠిన జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వును పొడిగించిన విషయం ఏసీపీ కృష్ణయ్యకు తెలియదని, నేరం తీవ్రత దృష్ట్యానే ఆయన అలా వ్యవహరించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.
►ALSO READ | నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోరం.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని.. యజమాని, ఇద్దరు కొడుకులపై హత్యాయత్నం
ఏసీపీ కోర్టుకు బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఉత్తర్వును పొడిగించారో లేదో తనిఖీ చేయడం అధికారి బాధ్యత అని పేర్కొన్న న్యాయస్థానం.. ఏసీపీ వివరణ, క్షమాపణను తిరస్కరించింది. పీపీ అభ్యర్థన మేరకు ఏసీపీ అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా న్యాయమూర్తి ఆ ఉత్తర్వు అమలును నాలుగు వారాల పాటు నిలిపివేశారు.