Reading Time: 2 minutes
రాణి రుద్రమ నుంచి సమ్మక్క-సారక్క, పీవీ నరసింహరావు వరకు.. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కి ఏ పేరు బాగుంటుంది?

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఏం పేరు పెడదాం?.. తెలంగాణలో ఈ నేమ్‌ సెర్చింగ్‌ హంట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్‌ పిలుపుతో.. వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పేరుపై సూచనలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు.. ఎవరి అభిప్రాయాలు వాళ్లు వెల్లడిస్తున్నారు. రాణి రుద్రమ నుంచి సమ్మక్క-సారక్క వరకు… కాకతీయుల నుంచి ఇతర ప్రముఖుల పేర్ల వరకు.. ఇలా అనేక ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో డిబేట్‌ నడుస్తుండగా.. అటు పొలిటికల్‌గానూ కామెంట్స్‌, కౌంటర్స్‌ తెరపైకి వస్తుండటం హీట్‌ పెంచేస్తోంది.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌… వరంగల్‌ దశాబ్దాల కల.. ఇప్పుడా కల సాకారం అవుతున్న వేళ ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలన్న చర్చ జోరుగా కొనసాగుతోంది. నిజానికి వరంగల్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటు వ్యవహారం ఇంకా మొదటి దశంలోనే ఉంది. కానీ.. అప్పుడే దానికి ఏ పేరు పెట్టాలనే అంశం మయా ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. మామునూరు ఎయిర్‌పోర్టుకు పేరును సూచించాలంటూ సీఎం రేవంత్‌ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది.

సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో డిబేట్‌ నడుస్తుండగా.. అటు పొలిటికల్‌గానూ కామెంట్స్‌, కౌంటర్స్‌ తెరపైకి వస్తుండటం హీట్‌ పెంచేస్తోంది. ప్రధానంగా.. రాజకీయ నేతల నుంచి వరంగల్‌ ఎయిర్‌పోర్ట్ పేర్లపై భారీగా సూచనలు, సలహాలు, కామెంట్స్‌ వస్తున్నాయి. రీసెంట్‌గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌, బీర్ల ఐలయ్య, నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌.. ఇలా పలువురు నేతలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మామునూరు విమానాశ్రయానికి రాణిరుద్రమదేవి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌గా పేరు పెట్టాలన్నారు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌. మామునూరు ఎయిర్‌పోర్ట్‌ కోసం కేసీఆర్‌ అహర్నిశలు కష్టపడ్డారని గుర్తు చేశారు. అనేకసార్లు ప్రధాని సహా అప్పటి విమానయాన మంత్రులను కలిశారని చెప్పారు. బీఆర్ఎస్‌ ఏం చేయలేదని చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు.

పీవీ నరసింహారావు పేరు పెట్టాలి- సీపీఐ నారాయణ

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు సీపీఐ నారాయణ కూడా స్పందించారు. వరంగల్‌లో నిర్మించే విమానాశ్రయానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలన్నారు. అదేసమయంలో అధికార పార్టీ నేతల కామెంట్స్‌కు కౌంటర్స్‌ తెరపైకి వచ్చాయి. సినీ సెలబ్రిటీలు కూడా పెద్దయెత్తున రియాక్ట్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే.. విజయ్‌ దేవరకొండ, బండ్ల గణేష్‌ సహా పలువురు కూడా ఈ చర్చలో భాగమయ్యారు. బండ్ల గణేష్‌ ఇప్పటికే రాణి రుద్రమదేవి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ పేరును సూచించారు.

దట్స్‌ ది స్పిరిట్‌.. సీఎం రేవంత్ రెడ్డి..

ఇక అంతకుముందు.. వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు రెండు పేర్లను సూచించారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు.. పేర్లను పరిశీలించాలని సూచించారు. సందీప్‌రెడ్డి వంగా ట్వీట్‌కు సీఎం రేవంత్‌ స్పందించారు. దట్స్‌ ది స్పిరిట్‌ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరి మధ్య జరిగిన కొద్దిపాటి సోషల్ మీడియా సంభాషణ నెటిజన్లను ఆకర్షించింది. ఇక.. సమ్మక్క-సారక్క ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అనే పేరు పెట్టాలని డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల సూచించారు.

సినిమా షూటింగ్స్‌ సందడి పెరుగుతుంది..

అటు.. నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ కూడా.. ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. విమానాశ్రయ నిర్మాణ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ ఎయిర్‌పోర్టు రాకతో వరంగల్ పరిసరాల్లో సినిమా షూటింగ్స్‌ సందడి పెరుగుతుందని ఆనందం వ్యక్తం చేసింది. మరోవైపు.. సీఎం రేవంత్‌ పిలుపునకు నెటిజన్లు కూడా స్పందించారు. ప్రొఫెసర్ జయశంకర్ ఎయిర్‌పోర్ట్, రాణి రుద్రమ ఎయిర్‌పోర్ట్, సమ్మక్క సారక్క ఎయిర్‌పోర్ట్, చాకలి ఐలమ్మ ఎయిర్‌పోర్ట్ పేర్లు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

సోషల్‌ మీడియాలో కొత్త ట్రెండ్‌..

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేరు సూచించాలన్న సీఎం రేవంత్‌ పిలుపుతో సోషల్‌ మీడియాలో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. ఎవరికి నచ్చిన పేరుతో వాళ్లు ఏఐ ఫొటోలు క్రియేట్‌ చేసి షేర్‌ చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌ గేటుపై రాణి రుద్రమ పేరు… మరోచోట కాకతీయ పేరు.. ఇంకొకచోట సమ్మక్క-సారక్క పేరు… ఇలా ఊహాజనిత డిజైన్లు వైరల్‌ అవుతున్నాయి. మొత్తంగా.. వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పేరు ఇప్పుడు రాజకీయ, సినీ, సోషల్‌ మీడియా వర్గాల్లో చర్చగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..