
TGPSC Syllabus Changes: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సిలబస్ మార్పులపై కీలక ప్రకటన చేసింది.. వివిధ నియామకాలకు సంబంధించిన సిలబస్ మార్పులపై అభ్యర్థుల నుంచి వస్తున్న అభ్యర్థనల నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటన చేసింది. సిలబస్ మార్పులపై అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ ఎలాంటి సిలబస్ కమిటీని ఏర్పాటు చేయలేదని సర్వీస్ కమిషన్ వెల్లడించింది. సిలబస్‌లో భారీ మార్పులు చేయాలని ప్రతిపాదించిన సందర్భంలో అభ్యర్థులకు కనీసం ఏడాది ముందుగానే సమాచారం అందిస్తామని తెలిపింది.
అదే సమయంలో సిలబస్‌లో స్వల్ప మార్పులు మాత్రమే ఉంటే.. సంబంధిత నియామక నోటిఫికేషన్‌తో పాటు కొత్త సిలబస్‌ను విడుదల చేస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. దీంతో సిలబస్ మార్పులపై అభ్యర్థులు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రస్తుతం సిలబస్ మార్పులపై జరుగుతున్న ప్రచారంపై అభ్యర్థులకు స్పష్టత ఇచ్చేందుకే ఈ ప్రకటన చేసినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. భారీ స్థాయిలో మార్పులు ప్రతిపాదిస్తే ముందుగానే తెలియజేస్తామని, స్వల్ప మార్పులుంటే నోటిఫికేషన్ సమయంలోనే కొత్త సిలబస్ అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. కాగా, గతంలో ఉన్న సిలబస్‌తో పోలిస్తే ఇప్పుడు TGPSC కొత్త Paper-I సిలబస్‌లో మార్పులు చేయాలని నిర్ణయించిన విషయం విదితమే.. ఈ సిలబస్ మరింత విస్తృతంగా, స్పష్టంగా ఉంది. పాత సిలబస్‌లో 11 అంశాలు ఉండగా, కొత్త సిలబస్‌లో 15 అంశాలు తీసుకొచ్చారు.. మరీ ముఖ్యంగా ఎకానమీ, పాలిటీ, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ డెమోగ్రఫీ, ఆధునిక భారత చరిత్ర వంటి అంశాలు చోటు దక్కించుకున్నాయి. అందువల్ల పాత మెటీరియల్‌ను మాత్రమే ఆధారంగా చేసుకుని చదివితే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతూ రాగా.. ఇప్పుడు దానిపై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ..