
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా డి.అశోక్ బాధ్యతలు స్వీకరించారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్‌పై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే.
2026, ఆగస్ట్ 20న సుమంత్ ఓ రియల్టర్‌పై దాడి చేయగా, కేసు నమోదు చేయకపోవడంతో సీపీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు వారాలు మాత్రమే జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా ముత్తు యాదవ్ విధులు నిర్వర్తించారు.
ముత్తు యాదవ్ కంటే ముందు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేసిన శ్రీనివాసులు రెడ్డిని కూడా పోలీస్ శాఖ సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఓ మహిళను నమ్మించి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో నిర్ధారణ కావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. దర్యాప్తులో మహిళ వ్యక్తిగత వీడియోలను అడ్డంగా పెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు.
►ALSO READ | జూరాల నుంచి నీళ్లు ఇవ్వకపోవడానికి బీఆర్ఎస్సే కారణం: మంత్రి జూపల్లి
కొంతకాలం పాటు సీఐ శ్రీనివాసులు రెడ్డి, బాధిత మహిళ ఒకే ఇంట్లో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆమెను వదిలించుకునేందుకు సీఐ వివిధ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సీఐ శ్రీనివాసులపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఇలా.. పలు కారణాల వల్ల.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు ఒకే సంవత్సరంలో ముగ్గురు సీఐలు మారడం గమనార్హం.