
Lust Stories 3: సినిమాల్లో సన్నిహిత సన్నివేశాలు కనిపించినప్పుడు ప్రేక్షకులకు తెరపై కనిపించేది కొన్ని నిమిషాల విజువల్స్ మాత్రమే. కానీ వాటి వెనుక నటీనటులు, దర్శకుడు, కెమెరా టీమ్ ఎంత జాగ్రత్తగా పనిచేస్తారో చాలామందికి తెలియదు. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 3’ బోల్డ్ కంటెంట్ తో ఓటీటీలో తెగ సందడి చేస్తోంది. ఇందులో హీరో సిద్ధార్థ్ తన భార్య అదితి రావు హైదరితో ఇంటిమేట్ సీన్స్ లో నటించాడు. ఈ విషయంపై హీరో సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నిజ జీవితంలో భార్యాభర్తలైనప్పటికీ కెమెరా ముందు సన్నిహిత సన్నివేశాల్లో నటించడం మొదట్లో వింతగా అనిపించిందని, అయితే వృత్తిపరంగా పాత్రకు న్యాయం చేశామని తెలిపారు. సురక్షితమైన వాతావరణం కోసం హాలీవుడ్ తరహాలో ‘ఇంటీమసీ కోఆర్డినేటర్’ సహాయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఆంథాలజీ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) లో పలువురు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. నలుగురు దర్శకులు, నాలుగు విభిన్న కథలతో తెరకెక్కించిన ఈ బోల్డ్ ఎమోషనల్ సిరీస్‌లో రియల్ లైఫ్ కపుల్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది. వీరితో పాటు విజయ్ వర్మ, రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అలీ ఫజల్, రాధికా మదన్, అభిషేక్ బెనర్జీ, గుర్ఫతే పిర్జాదా, సనా థంపి, గజరాజ్ రావు లాంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మహిళల కోణంలో కోరిక, సంబంధాలు, సాన్నిహిత్యాన్ని ఈ ఆంథాలజీ చూపిస్తుంది. ఇందులో విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన కథలో అదితి రావు హైదరి, సిద్ధార్థ్ కథ హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది. నిజ జీవిత జంట కావడంతో తెరపై ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఈ బోల్డ్ సీన్స్ షూట్ చేసేటప్పుడు సెట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో సిద్ధార్థ్ తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. సన్నిహిత సన్నివేశాల షూటింగ్ సమయంలో ఇంటీమసీ కోఆర్డినేటర్లు ఉండటం వల్ల మొత్తం ప్రక్రియ చాలా ప్రొఫెషనల్‌గా, సురక్షితంగా ఉంటుందని ఆయన చెప్పారు. షూటింగ్ సమయంలో అవసరమైన సిబ్బంది మాత్రమే సెట్లో ఉండేలా చూసుకుంటారని, అనవసరంగా అక్కడ ఉన్నవారిని బయటకు పంపిస్తారని తెలిపారు. అదికూడా అనుమతి ఉంటేనే అలా ఉంటుందని సిద్ధార్థ్ స్పష్టం చేశారు. ఒక నటుడిని గాని, నటిని గాని ఎవరైనా తాకాల్సి వస్తే అది ముందుగా అతని లేదా ఆమె సమ్మతితోనే జరగాలని స్పష్టం చేశారు. షూటింగ్ సమయంలో నటీనటులకు ముందుగానే పరిచయం ఉన్న మహిళా సభ్యురాలు కూడా అక్కడ ఉండటం తప్పనిసరి అని వివరించారు.
తాము నిజ జీవితంలో భార్యాభర్తలు అయినప్పటికీ, షూటింగ్ సమయంలో ఈ నియమాల్లో ఎలాంటి మినహాయింపు ఉండదని సిద్ధార్థ్ స్పష్టం చేశారు. వ్యక్తిగత సంబంధం వేరు, నటులుగా తమ బాధ్యత వేరు అనే విషయాన్ని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. తాము పాత్రల్లో మాత్రమే ఉంటామని, చుట్టూ కెమెరా, దర్శకుడు, ఇతర సిబ్బంది ఉంటారని ఆయన వివరించారు. ఇంటీమసీ కోఆర్డినేటర్ పాత్ర ఎంత ముఖ్యమో కూడా సిద్ధార్థ్ చెప్పారు. సెట్లో అత్యంత సున్నితమైన లేదా బలహీనమైన స్థితిలో ఉన్న వ్యక్తి భద్రతను కాపాడటం వారి బాధ్యత అని అన్నారు. నటీనటులకు నచ్చని పనిని చేయమని అక్కడ ఎవరూ ఎవరినీ బలవంతం చేయరని స్పష్టం చేశారు. ‘లస్ట్ స్టోరీస్ 3’లోని కథలు, వాటి ట్రీట్‌మెంట్‌పై ప్రేక్షకుల నుంచి భిన్నమైన రియాక్షన్ వస్తున్నప్పటికీ, సిద్ధార్థ్, అదితి జంట నటించిన భాగం మాత్రం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. తెరపై కనిపించే బోల్డ్ సన్నివేశాల వెనుక కూడా స్పష్టమైన నియమాలు, ప్రొఫెషనలిజం ఉంటాయని సిద్ధార్థ్ వెల్లడించిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.