Reading Time: 3 minutes
Iran Code 100 Alert Trump Camp David Early Return Middle East Tensions

పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా? బాంబుల మోతతో దద్దరిల్లనుందా? మధ్యప్రాచ్యం మళ్లీ కుతకుతలాడనుందా? తాజా పరిణామాలు చూస్తుంటే.. అదే సంకేతాలు ఇస్తున్నాయి. ఒక వైపు హౌతీలు దూసుకొస్తుండడం.. ఇంకోవైపు ఇరాన్ ‘కోడ్ 100’ హెచ్చరిక జారీ చేయడం.. మరోవైపు వారాంతపు సెలవు దినాన్ని డేవిడ్ క్యాంప్ నుంచి ముందుగానే ముగించుకుని ట్రంప్ తిరిగి రావడం.. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికా పర్యటన కుదించుకుని తిరిగి వచ్చేయడం. ఇదంతా చూస్తుంటే మరోసారి పశ్చిమాసియా రణరంగంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఇంధన సంక్షోభంతో అల్లాడిపోతున్నాయి. మళ్లీ యుద్ధం వస్తే ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎల్‌నినో కారణంగా ప్రపంచ దేశాల్లో తీవ్ర ద్రవ్యోల్బణం ఏర్పడింది. దీనికి యుద్ధం కూడా తోడైతే ప్రపంచం ఆర్థికంగా తల్లకిందులయ్యే డేంజర్ సంకేతాలు వెలువడుతున్నాయి.

T

ఇరాన్‌కు సంబంధించిన ఓ కీలక వార్త ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ తన సాయుధ బలగాలకు ‘కోడ్ 100’ (Code 100) అలర్ట్ జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇరాన్ సైన్యం అత్యున్నత స్థాయి సన్నద్ధతగా పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ అలర్ట్ జారీ చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా లేదా ప్రభుత్వ వార్తా సంస్థలు ఇప్పటివరకు ధ్రువీకరించలేదు.

Iran

ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా క్యాంప్ డేవిడ్‌లో తన వారాంతపు పర్యటనను కుదించుకుని షెడ్యూల్ కంటే ముందుగానే వైట్‌హౌస్‌కు తిరిగి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ట్రంప్ ముందస్తు తిరుగు ప్రయాణానికి ఇరాన్ ‘కోడ్ 100’ అలర్ట్ కారణమని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.

ఇరాన్ ‘కోడ్ 100’ అంటే ఏమిటి?

నివేదికల ప్రకారం ‘కోడ్ 100’ అనేది ఇరాన్ సాయుధ బలగాలకు అత్యున్నత స్థాయి సైనిక సన్నద్ధతను సూచించే అలర్ట్‌గా పేర్కొంటున్నారు. ఇది నిజంగా అమలులోకి వచ్చినట్లయితే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), సాధారణ సైన్యం, భద్రతా బలగాలను అత్యంత అప్రమత్త స్థితిలో ఉంచే అవకాశం ఉంటుంది. సంభావ్య దాడులు లేదా సైనిక ఘర్షణలకు వెంటనే స్పందించేందుకు దళాలను సిద్ధంగా ఉంచడం, సైనిక సమాచార వ్యవస్థలను మరింత చురుకుగా చేయడం, వేగవంతమైన మోహరింపులకు ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు ఇందులో ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. అయితే ‘కోడ్ 100’ నిజంగా అమలు చేశారా? దాని కచ్చితమైన అర్థం ఏమిటి? అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు.

ఇప్పుడే ‘కోడ్ 100’ వార్తలు ఎందుకు?

పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ దళాలు సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించాయి. రియాద్ పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు హౌతీలు పేర్కొనగా.. సౌదీ అధికారులు తమ వైమానిక రక్షణ వ్యవస్థలు incoming threats (ముంచుకొస్తున్న ముప్పులు)ను అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ పరిణామాలతో ప్రాంతీయ మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి దిగజారడంతో ఈ ప్రాంతంలో ఉన్న అమెరికన్లకు కూడా అమెరికా ప్రభుత్వం భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.

ట్రంప్ ముందుగానే తిరుగు ప్రయాణం

ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ తన వారాంతపు క్యాంప్ డేవిడ్ పర్యటనను కుదించుకుని ముందుగానే వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చారు. అయితే ఈ నిర్ణయానికి ఏదైనా నిర్దిష్ట సైనిక చర్య కారణమని వైట్‌హౌస్ అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ.. ట్రంప్ ముందస్తు తిరుగు ప్రయాణం, ఇరాన్ ‘కోడ్ 100’కు సంబంధించిన వార్తలు ఒకే సమయంలో వెలువడటంతో వీటి మధ్య సంబంధం ఉందా? అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా తన అమెరికా పర్యటనను కుదించుకుని ఇజ్రాయెల్‌కు తిరిగి వెళ్లినట్లు సమాచారం.

అమెరికా కీలక హెచ్చరిక

మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు ప్రస్తుతం ‘క్లిష్టంగా’ ఉన్నాయని, అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతంలోని అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విమాన సర్వీసుల రద్దు, గగనతల మూసివేత వంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఇరాన్ లేదా ఇరాన్‌కు మద్దతు ఇచ్చే సంస్థలు విదేశాల్లోని అమెరికా ప్రయోజనాలు, అమెరికా పౌరులతో సంబంధం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్ ‘కోడ్ 100’ అలర్ట్‌కు సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేకపోయినా.. హౌతీ దాడులు, అమెరికా భద్రతా హెచ్చరికలు, పశ్చిమాసియాలో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వార్త మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Trump

Code