Reading Time: 1 minute

ఇన్వెస్టర్లను నిండా ముంచిన విప్రో షేర్లు: ఆల్ టైం హై నుంచి 55% పడిపోయిన స్టాక్

Caption of Image.

ఐటీ రంగంలో టాప్ కంపెనీల్లో ఒకటైన విప్రో షేర్లు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు రికార్డ్ స్థాయి లాభాలను అందించిన ఈ స్టాక్.. ప్రస్తుతం భారీ పతనంతో ఇన్వెస్టర్ల పెట్టుబడులను నీళ్లపాలు చేస్తోంది. 2021 ఏడాది చివరి నాటికి అక్టోబర్ 14, 2021న రూ.369.93 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకిన విప్రో షేరు.. అక్కడి నుంచి ఏకంగా 55 శాతం మేర పడిపోయింది. ప్రస్తుతం ఈ ఐటీ మేజర్ స్టాక్ ఒక్కోటి రూ.163.35 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా తగ్గి రూ. లక్షా 63వేల కోట్లకు పడిపోయింది.

ప్రస్తుతం బేర్ గ్రిప్‌లో చిక్కుకున్న విప్రో షేరు అన్ని ప్రధాన మూవింగ్ యావరేజెస్‌కు దిగువనే పయనిస్తోంది. ఈ ఒక్క సంవత్సరంలోనే విప్రో స్టాక్ సుమారు 38 శాతం నష్టపోగా, 5 ఏళ్ల కాలంలో ఏకంగా 51 శాతం క్షీణించింది. ప్రస్తుతం ఈ స్టాక్ RSI సుమారు 35 వద్ద ఉండి, ఓవర్‌సోల్డ్ జోన్‌కు సమీపంలో కదులుతోంది. ఈ స్టాక్‌లో బేరిష్ మొమెంటం స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఈ పరిస్థితికి కేవలం కంపెనీ పనితీరు మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ పరిణామాలు కూడా ప్రధాన కారణమే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, అమెరికాలో కఠినమైన ద్రవ్య విధానాలు అమలుకావడం భారతీయ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా కంపెనీలు తమ టెక్నాలజీ బడ్జెట్‌ను కుదించుకోవడం, విచక్షణాత్మక వ్యయాలను వాయిదా వేయడం విప్రో లాంటి సంస్థల ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీనికి తోడు అమెరికా టారిఫ్‌లు, AI సృష్టిస్తున్న అంతరాయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఐటీ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి.

బిజినెస్ కోసం అమెరికా మార్కెట్లపైనే అత్యధికంగా ఆధారపడే విప్రోకు ఈ పరిస్థితులు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ప్రస్తుతం కొత్త కొనుగోళ్లకు దూరంగా ఉండాలని, స్టాక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున ఇన్వెస్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు విప్రో షేర్ల విషయంలో. దీర్ఘకాలంలో కోలుకోవడానికి సమయం పట్టేలా ఉండటంతో.. ఇన్వెస్టర్లు ఈ స్టాక్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

©️ VIL Media Pvt Ltd.