Reading Time: < 1 minute
Vattepalli Auto Driver Murder Rs 10 Dispute Rajendranagar Hyderabad

Hyderabad: హైదరాబాద్‌ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో జరిగిన ఓ దారుణమైన ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. కేవలం పది రూపాయల చిల్లర విషయంలో జరిగిన గొడవ, ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలనే తీసేసింది. అసలు ఏం జరిగిందంటే.. వట్టేపల్లి ప్రాంతానికి చెందిన మొహమ్మద్ ముఖర్రం (42) అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఆటో ఛార్జీకి సంబంధించిన చిల్లర పది రూపాయల విషయంలో ఆయనకు, కొందరికి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ మాట మాట పెరిగి కాస్తా గొడవగా మారింది. ఆవేశంతో రగిలిపోయిన సదరు వ్యక్తులు ముఖర్రంపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితులు విషమించి కన్నుమూశారు.

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అజీమ్ అనే ఒక యూట్యూబర్, మరో వ్యక్తి షోయబ్ కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించాయని, వారి పాత్రపై విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే అసలు అక్కడ ఏం జరిగింది? ఈ ఘటనలో ఎవరినైనా అరెస్ట్ చేశారా? అనే వివరాలు పోలీసులు అధికారికంగా తెలిజేయాల్సి ఉంది. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే బహదూర్ పురా ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్ అక్కడికి చేరుకుని, బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. “వట్టేపల్లి ప్రాంతంలో అజీమ్, షోయబ్ మరికొందరు అనుచరులు రౌడీషీటర్లుగా వ్యవహరిస్తూ గూండాగిరీ చేస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే ఇదే రోడ్డుపై జరిగిన రెండో హత్య ఇది. రాజేంద్రనగర్ డీసీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి నిందితులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి. ఈ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలి. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం,” అని ఎమ్మెల్యే ముబీన్ డిమాండ్ చేశారు.