Reading Time: < 1 minute
Ap Secretariat Employees Aas Sgp 6 Years Service

AAS SGP : ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరేళ్ల సర్వీసును విజయవంతంగా పూర్తి చేసుకున్న సిబ్బందికి ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (AAS) కింద స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్ (SGP) మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది.

1.30 లక్షల మంది ఉద్యోగులకు నేరుగా లబ్ధి

ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000కు పైగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో విధినిర్వహణలో ఉన్న సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా 2019, 2020 సంవత్సరాల్లో తొలి విడత రిక్రూట్‌మెంట్‌లో ఎంపికై బాధ్యతలు స్వీకరించిన సిబ్బందికి ఈ స్కేల్ వర్తిస్తుంది. 11వ వేతన సవరణ కమిషన్ (PRC) చేసిన సూచనలకు అనుగుణంగానే ప్రభుత్వం ఈ ఆర్థిక లబ్ధిని అమల్లోకి తెచ్చింది.

హోదా పెంపు కాదు.. కేవలం ఆర్థిక భరోసా మాత్రమే

కాగా, ఇది రెగ్యులర్ ప్రమోషన్ కాదని, సుదీర్ఘకాలంగా ఒకే పోస్టులో సేవలు అందిస్తున్న ఉద్యోగులకు లభించే ఆర్థిక ఊరట మాత్రమేనని అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌లో భాగమైన ఈ వ్యవస్థ ద్వారా 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి స్పెషల్ గ్రేడ్ అందిస్తుండగా, ఆ తర్వాత వరుసగా 12, 18, , 24 ఏళ్ల సర్వీసును అధిగమించిన కొద్దీ తదుపరి స్థాయి ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయని వివరించారు.

రికార్డుల పరిశీలనకు ఆదేశాలు.. సర్వత్రా హర్షాతిరేకాలు

తాజా జీవో నేపథ్యంలో, సచివాలయాల్లో అర్హులైన ఉద్యోగుల సర్వీస్ రికార్డులను తక్షణమే క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎలాంటి ఆలస్యం లేకుండా స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్‌ను వర్తింపజేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చే ఈ నిర్ణయం పట్ల సచివాలయ ఉద్యోగులు, వారి సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.