Reading Time: 2 minutes

E20 పెట్రోల్ ఇబ్బందులు, పెరగని కమిషన్లు, UPI ఛార్జీల మోత: సంక్షోభంలో పెట్రోల్ బంకు ఓనర్స్!

Caption of Image.

దేశంలోని పెట్రోలియం డీలర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నడుస్తున్న రిటైల్ వ్యాపారం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. బంకుల్లో UPI లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను విధించే ప్రతిపాదనపై యునైటెడ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యలతో పాటు డీలర్లు ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై తక్షణమే మోడీ ప్రభుత్వ విధానపరమైన జోక్యం అవసరమని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. 

యూపీఐ లావాదేవీలపై ఛార్జీల భారం..
ప్రభుత్వ డిజిటల్ ఇండియా చొరవలో భాగంగా పెట్రోలియం రిటైల్ అవుట్‌లెట్లు డిజిటల్ చెల్లింపులను, ముఖ్యంగా యూపీఐ చెల్లింపులను భారీగా ప్రోత్సహించడంలో ముందున్నాయి. అయితే ఇప్పుడు ఈ లావాదేవీలపై MDR ఛార్జీలను వేస్తే డీలర్ల ఆదాయం ఆవిరైపోతుందని సంఘం జనరల్ సెక్రటరీ స్కరియా ఆందోళన వ్యక్తం చేశారు. డీలర్లపై ఈ భారం మోపితే భవిష్యత్తులో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ఆర్థికంగా కష్టతరమవుతుందని.. ఇది తమ వ్యాపారానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.

E20 పెట్రోల్ సమస్యలు..
ఇప్పటికే కొత్తగా ప్రవేశపెట్టిన E20 పెట్రోల్ డీలర్లకు సరికొత్త నిర్వహణ సవాళ్లను తెచ్చిపెట్టింది. అధిక ఇథనాల్ కలిగిన పెట్రోల్ నిల్వ చేయడానికి, నిర్వహించడానికి అనేక రిటైల్ అవుట్‌లెట్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సి వస్తోంది. స్టోరేజ్ ట్యాంకులు, పరికరాల అనుకూలత, మెటీరియల్ మన్నిక వంటి అంశాలపై తగిన ఆర్థిక, సాంకేతిక మద్దతు లభించడం లేదని డీలర్లు చెబుతున్నారు. వాహనాల్లో E20 అనుకూలతపై ప్రజలలో అవగాహన తక్కువగా ఉండటం వల్ల కస్టమర్ల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.

ALSO READ : మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై కొత్త UPI ఛార్జీల మోత

పడిపోతున్న అమ్మకాలు..
మార్కెట్ డిమాండ్‌ను అంచనా వేయకుండా దేశవ్యాప్తంగా పెట్రోలియం రిటైల్ అవుట్‌లెట్లు విపరీతంగా పెరిగిపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. మార్కెట్ సంతృప్త చెందడం వల్ల ఇప్పటికే ఉన్న అవుట్‌లెట్లలో సేల్స్ వాల్యూమ్ భారీగా పడిపోయింది. ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్భన్ ప్రాంతాల్లో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. తగినంత డిమాండ్ లేనిచోట ఎక్కువ బంకులు ఏర్పాటు చేయడం వల్ల వాటి ఆర్థిక లాభదాయకత దెబ్బతిని, కొందరు డీలర్లు తమ వ్యాపారాలను పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని డీలర్స్ చెబుతున్నారు. 

నిలిచిపోయిన డీలర్ కమిషన్లు..
దేశవ్యాప్తంగా నిరంతరం ఇంధన సరఫరాను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. డీలర్లకు లభించే కమిషన్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. గత 9 ఏళ్లలో డీలర్ కమిషన్ లీటరుకు కేవలం 30 పైసలు మాత్రమే పెరిగిందని యూనియన్ తెలిపింది. ఇది ప్రస్తుతం పెరిగిన నిర్వహణ ఖర్చులతో పోలిస్తే చాలా తక్కువని వాపోతున్నారు. అదనంగా చట్టపరమైన వేతనాల పెంపు వల్ల లేబర్ ఖర్చులు, ఆటోమేటెడ్ సిస్టమ్స్ వాడకం పెరగడంతో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయట.

పెరగని కమిషన్లు, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, విపరీతంగా కొత్త అవుట్‌లెట్ల విస్తరణ కారణంగా పడిపోయిన అమ్మకాలు, E20 ఇంధన సవాళ్లు, యూపీఐపై MDR ఛార్జీల భారం అన్నీ కలిసి పెట్రోలియం డీలర్లను తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ట్రోలియం డీలర్‌షిప్‌ల మనుగడను రక్షించడానికి ప్రభుత్వం తక్షణమే విధానపరమైన చర్యలు తీసుకోవాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రోజుకో కొత్త ఖర్చు తమపై రుద్దితే బిజినెస్ ఎలా నడపగలం అంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.