
ఒక్కో రంగు ఓ కథ చెప్తుంది.. ఒక్కో గీత ఓ భావాన్ని పలుకుతుంది… ఒక్కో శిల్పం ఓ చరిత్రను కళ్లముందు నిలుపుతుంది. పెయింటింగ్స్ నుంచి శిల్పాల వరకు.. మట్టి బొమ్మల నుంచి ఫొటోగ్రఫీ వరకు… హైదరాబాద్ లో కళలకు కొదవే లేదు. కళాకారుల సృజనాత్మకతకు అద్దం పడుతున్న ఆర్ట్ గ్యాలరీలు హైదరాబాదీలకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. మరి ఈ కళా లోకంలో ఏం ఉంది..? కళమనసుకు ఎలాంటి ఆనందాన్ని ఇస్తోంది? ఓసారిచూద్దాం.
రంగులు, బ్రష్ లతో కాన్వాస్ పై ఆవిష్కరించే భావాలు.. రాయి, కలప, మట్టి, లోహాలపై చెక్కే శిల్పాలు.. చేతితో రూపొందించే కుండలు, బొమ్మలు, అలంకరణ వస్తువులు.. ఇలా కళకు ఎన్నో రూపాలు. కళాకారుడి మనసులోని సంతోషం, బాధ. ఆలోచన.. సమాజంలోని పరిస్థితులు.. అన్నీ కళారూపాల్లో ప్రతిబింబిస్తాయి.
పూర్వకాలం నాటి శిల్పాలు, చిత్రాలు అప్పటి ప్రజల జీవన విధానాన్ని మనకు పరిచయం చేస్తే.. నేటి కళాకారుల సృజన సమకాలీన సమాజాన్ని మన కళ్లముందు నిలుపుతుంది. అందుకే కళాకృతులను చూడటం కేవలం వినోదం మాత్రమే కాదు.. మనసుకు ప్రశాంతతను, కొత్త ఆలోచనలను అందించే అనుభవం కూడా అందిస్తోంది.
హైదరాబాద్ అనగానే మనకు ప్రసిద్ధమైన చార్మి నార్ గుర్తుకొచ్చినప్పటికీ, ఈ నగరంలో చూడటానికి ఇంకా చాలా ఉన్నాయి. కళ,సంస్కృతి గురించి మాట్లాడుతున్నప్పుడు హైదరాబాద్ లోని ఆర్ట్ గ్యాలరీని ప్రస్తావించకుండా ఎలా ఉండగలం? నిజానికి హైదరాబాద్ నగరమంతటా లెక్కలేనన్ని ఆర్ట్ గ్యాలరీలు ఉన్నాయి. హైదరాబాద్ లో మీరు సందర్శించే ఏ ఆర్ట్ గ్యాలరీలోనైనా, అన్ని రకాల కళా ఖండాల అద్భుతమైన సేకరణ కనిపిస్తుంది.
కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ, సృష్టి , ఆర్ట్ గ్యాలరీ, సాలార్ జంగ్ మ్యూజియం ఆర్ట్ గ్యాలరీ, ఐకానార్ట్ గ్యాలరీ, పెగాసస్ ఆర్ట్ గ్యాలరీ, అలంకృత ఆర్ట్ గ్యాలరీ, స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, బిర్లా మోడరన్ ఆర్ట్ గ్యాలరీ, ఇన్ స్పైర్ ఆర్ట్ గ్యాలరీలు కళాప్రియులతో కళకళలాడుతున్నాయి.
తెలంగాణ సంస్కృతి, పండుగలు, స్థానిక కళాకారుల సృజనను ప్రతిబింబించే ఫొటోలు, కళాఖండాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇలా నగరంలోని ఆర్ట్ గ్యాలరీలు కేవలం కళాకృతుల ప్రదర్శన కేంద్రాలుగానే కాకుండా కళాకారులు, కళాభిమానులు, కొత్తతరం మధ్య వారధిగా మారుతున్నాయి.
జీవితంలో స్ఫూర్తి పొందాలంటే హైదరాబాద్ లోని కళా కేంద్రాలైన కళా మ్యూజియాలు, ఆర్ట్ గ్యాలరీలు, చిత్రలేఖనాలు, హైదరాబాద్ మ్యూజియాలు, హైదరాబాద్ పెయింటింగ్స్ ను సందర్శించాలని కళాకారులు కోరుతున్నారు.
తెలంగాణ స్టేట్ గ్యాలరీ
తెలంగాణ ప్రభుత్వం కల్చరల్ హబ్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ పేరిట ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. పండుగల ఫొటోలు, తెలంగాణ కళాకారులు చిత్రీకరించిన కళాఖండాలను ఈ ఎగ్జిబిషనన్ లో ప్రదర్శిస్తున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కావూరి హిల్స్ లో ఉన్న స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ సమీపంలో అత్యంత ప్రజాదరణ పొందిన కళాకృతుల గ్యాలరీ అయిన కళాకృతి ఆర్ట్ గ్యాలరీ కళా ప్రదర్శన కోసం బెస్ట్ చాయిస్.
ఈ గ్యాలరీలో సత్యజిత్ దవే రూపొందిం చిన ఈ ప్రదర్శన అక్టోబర్ 4 వరకు కొనసాగనుంది. ఇక్కడ ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. నగరంలోని ఆర్ట్ గ్యాలరీలు కళాకారులకు గుర్తింపు తీసుకువచ్చాయని చెప్పారు చిత్రకా రుడు రాజు.
కళా ప్రేమికులకు గొప్ప విందు
నగరంలోని ట్యాంక్ బండ్ రోడ్ పై హుస్సేన్ సాగర్ సరస్సుకు ఎదురుగా మారియట్ హోటల్ లోపల ఉన్న మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో అత్యంతసుందరమైన కళాఖండాలను చూడొచ్చు. హోటల్లో బస చేయని వారితో సహా అందరికీ ఈ ఆర్ట్ గ్యాలరీ తెరిచి ఉంటుంది. ఇది కళా ప్రేమికులకు ఒక గొప్ప విందులాంటిది. జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని సృష్టి ఆర్ట్ గ్యాలరీ నగరంలోని అత్యంత ప్రసిద్ధ ఆర్ట్ గ్యాలరీల్లో ఒకటి. ఇది అనేక ప్రఖ్యాత వృత్తిపరమైన కళా కారుల చిత్రాలు ఉన్న ఉత్తమ గ్యాలరీలలో ఒకటి.
ఈ గ్యాలరీ కొత్త ప్రతిభావంతులైన కళాకారుల చి త్రాలను కూడా ప్రదర్శిస్తుంది. అందుకే ఇది తర్వాతి తరం కళాకారులలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటిగా నిలిచింది. కావూరి హిల్స్ లోని అలంకృత ఆర్ట్ గ్యాలరీలో భారతీయ కళాకృతులు, సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు జరుగుతు న్నాయి.
ఈ ఆర్ట్ గ్యాలరీ యంగ్, టాలెంటెడ్ ఆర్టిస్ట్ లను కళా ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి సాయ పడటంలో ప్రసిద్ది చెందింది. ఈ గ్యాలరీ ఏకవ్యక్తి ప్రదర్శనల నుంచి సమూహ ప్రదర్శనల వరకు అనేక ప్రదర్శనలను నిర్వహించింది. ఎంతోమంది ప్రఖ్యాత సమకాలీన భారతీయ కళాకారుల చిత్రాలు ఈ గ్యాలరీలో ప్రదర్శించారు.
ఏ కళాకారునికైనా లేదా కళాభిమానికైనా ఇది ఒక చక్కటి ప్రదేశం. హైదర్ గూడలోని హోటల్ సెంట్రల్ పార్క్ కు ఎదురుగా ఉన్న ఇన్ స్పైర్ ఆర్ట్ గ్యాలరీ కొత్తగా ఎదుగుతున్న కళాకారులను, వారి కళాకృతులను చూడటానికి ఇది ఒక సరైన ప్రదేశం. పెయింటింగ్స్ వేసిన కళా కారుడు, పెయింటింగ్ ప్రత్యేకతను బట్టి ఈ కళాఖం డాల ధరలు ఉంటాయని నగరానికి చెందిన దేఖో ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నిర్మల్ చెప్పారు.
సాలార్ జంగ్ మ్యూజియం ఆర్ట్ గ్యాలరీ
సాలార్ జంగ్ మ్యూజియం ఆర్ట్ గ్యాలరీ నగరంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇది భారతదేశంలోని మూడు జాతీయ మ్యూజియంలలో ఒకటి. ఇందులో చారిత్రక కళలు, శిల్పాల అసాధారణమైన సేకరణ ఉంది. ఈ మ్యూజియంలోని ఆర్ట్ గ్యాలరీ విభాగంలో అనేక సమకాలీన కళలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.
బంజారాహిల్స లోని ఫార్ట్యూన్ ఎన్ క్లేవ్ లో ఉన్న ఐకోనార్ట్ గ్యాలరీలో సమకాలీన పెయింటింగ్స్, శిల్పాలు, ఫొటోగ్రఫీ కళాఖండాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక సృజనాత్మకతతో రూపొందించిన కళాకృతులతో పాటు ప్రదర్శనలు, వర్క్ షాప్ లు, వర్ధమాన కళాకారుల కోసం ఆర్టిస్ట్ రెసిడెన్సీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ గ్యాలరీ కొత్త కళాకారుల ప్రతిభను ప్రోత్సహించి, వారి ప్రతిభను ప్రదర్శించడానికి వేదికను అందించే విషయంలో అగ్రగామి ఆర్ట్ గ్యాలరీల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఆర్ట్ గ్యాలరీకి సొంత క్యూరేటర్, కళా విమర్శకుడు కూడా ఉన్నారు. ఇక్కడ వరుసగా కళా ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.
ఆదర్శ్ నగర్-హిల్ ఫోర్ట్ భాస్కర్ ఆడిటోరియంలోని బిర్లా మోడరన్ ఆర్ట్ గ్యాలరీ బిర్లా సైన్స్ మ్యూజియం ప్రాంగణంలో ఉంది. ఇందులో ఆధునిక సమకాలీన కళల గొప్ప సేకరణ ఉంది. ఇది ఏ కళా ప్రేమికుడికైనా, కళాభిమానుడికైనా ఒక అద్భుత మైన ప్రదేశం. ఈ ప్రదేశం వివిధ కళా ప్రదర్శనలకు కూడా అందుబాటులో ఉంటుంది.
పెయింటింగ్స్, శిల్పాల ప్రదర్శనలకు వేదికగా…
బంజారాహిల్స్ లోని కదరి ఆర్ట్ గ్యాలరీ పెయింటింగ్స్, శిల్పాల ప్రదర్శనలకు వేదికగా నిలుస్తోంది. భారతీయ కళాకారులు ఇక్కడ తమ కళాకృతులను ప్రదర్శిస్తూ కళాభిమానులను ఆకట్టుకుంటున్నారు. మాదాపూర్ లోని ది కాంటెంపరరీ ఆర్ట్ స్పేస్ ఆధునిక కళలతో పాటు యువ కళాకారుల సృజనకు వేదికగా మారింది. కావూరి హిల్స్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నస్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ కూడా కళాభిమానులను ఆకర్షిస్తోంది.
హైదరాబాద్ నగరంలోని బేగంపేట చీకోటి గార్డెన్ లో దేఖో ఆర్ట్ గ్యాలరీ, బంజారాహిల్స్ రోడ్డు నంబరు 1 వెంగళరావు పార్కు సమీపంలో మేరకి ఆర్ట్ గ్యాలరీ, బేగంపేటలోని కలర్స్ ఆర్ట్ గ్యాలరీ కళాప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ గ్యాలరీ స్పేస్ లో ప్రముఖులతో పాటు అప్ కమింగ్ కళాకారులు రూపొందించిన పెయింటింగ్స్ ఫొటోగ్రఫీ కళాఖండాలు ప్రదర్శిస్తున్నారు. జూబ్లీహిల్స్ వాటర్ ట్యాంక్ కు ఎదురుగా ఉన్న పెగాసస్ ఆర్ట్ గ్యాలరీలో అద్భుతమైన కళాకృతులున్నాయి.