
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం పోటెత్తుతుండడంతో ఖైరతాబాద్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. 7 రోజుల్లోనే దాదాపు 15 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 4.5 లక్షల మందికి పైగా భక్తులు తరలిరావడంతో కిలోమీటర్ల మేర క్యూలైన్లు నిండిపోయాయి.
అయితే, 25న నిమజ్జనం ఉండడంతో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకే భక్తులకు మహా గణపతి దర్శనం కల్పించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 24న విగ్రహ నిమజ్జనానికి అవసరమైన ప్రత్యేక వెల్డింగ్, క్రేన్ల సర్దుబాటు వంటి తుది ఏర్పాట్లు చేయనున్నారు. 25న ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం పూర్తి చేయనున్నారు.