Reading Time: 2 minutes

వినాయక చవితి నవరాత్రుల్లో తొమ్మిది లేదా పదకొండు రోజుల పాటు పూజలందుకున్న గణనాథుల విగ్రహాలను చివరి రోజు ఎంతో వైభవంగా శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేయడం మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ, తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఒక గ్రామంలో మాత్రం వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా ఏళ్ల తరబడి పవిత్రంగా భద్రపరుస్తున్నారు. గత 78 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అరుదైన సంప్రదాయం వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

TG-MH సరిహద్దు గ్రామంలో వింత ఆచారం: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బైంసా సమీపంలోని పాలజ్ గ్రామంలో ఈ ప్రత్యేక సంప్రదాయం ఏటా కొనసాగుతోంది. ఇక ఇక్కడ చవితి రోజున ప్రత్యేక ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి 11 రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే చివరి రోజు మాత్రం నిమజ్జనానికి తీసుకెళ్లకుండా విగ్రహంపై పవిత్ర జలాలను చల్లి, మళ్లీ జాగ్రత్తగా భద్రపరుస్తారు.

A Ganesha Idol That Is Never Immersed: A Rare and Unique Tradition
A Ganesha Idol That Is Never Immersed: A Rare and Unique Tradition

కలరా, ప్లేగు వ్యాధులొచ్చిన వేళ..: ఈ వింత సంప్రదాయం వెనుక ఒక చారిత్రక కథనం ఉంది. 1948 ప్రాంతంలో ఈ గ్రామంలో కలరా, ప్లేగు వంటి భయంకరమైన వ్యాధులు తీవ్రంగా వ్యాపించి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ గండం నుంచి గ్రామాన్ని కాపాడాలని గ్రామస్థులంతా కలిసి ఒక ప్రత్యేకమైన కర్రతో గణపతి విగ్రహాన్ని తయారు చేయించి పూజలు ప్రారంభించారు.

కర్ర గణపతికి ప్రత్యేక పూజలు: నాటి నుంచి నేటి వరకు ఆ కర్ర గణపతి విగ్రహాన్నే ప్రతి ఏటా చవితి ఉత్సవాలకు ఉపయోగిస్తున్నారు. తొమ్మిది దశాబ్దాలు కా వస్తున్నా ఆ విగ్రహాన్ని నీటిలో కలపకుండా ఉంచడం ఇక్కడి ప్రత్యేకత. ఇక స్వామివారిపై నీళ్లు చల్లడం ద్వారా నిమజ్జనం పూర్తయినట్లు భావించి, మరుసటి ఏడాది ఉత్సవాల వరకు భద్రంగా దాచి ఉంచుతారు.

ఎంతో నిష్ఠతో గ్రామస్థులంతా కలిసి జరుపుకునే ఈ వినాయక ఉత్సవం స్థానికంగా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. తమ గ్రామాన్ని ఆపద నుంచి కాపాడిన స్వామివారిని ఏటా అదే విగ్రహ రూపంలో పూజించడం వారి అపార నమ్మకానికి నిదర్శనం.

గమనిక: ఇది తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామైన పాలజ్‌లో గత 78 ఏళ్లుగా వస్తున్న స్థానిక విశ్వాసాలు, సంప్రదాయాలు మరియు చారిత్రక కథనాల ఆధారంగా అవగాహన కోసం అందించబడిన ఆధ్యాత్మిక సమాచారం.

The post ఏళ్ల తరబడి నిమజ్జనం చేయని గణనాథుడు.. అరుదైన సంప్రదాయం! appeared first on Manalokam – Latest Telugu News & Updates.