
- నేను 2,902 గజాలు అమ్ముకుంటే.. కేసీఆర్ 2,902 ఎకరాలు కొల్లగొట్టిండు
- ఉద్యమం ముసుగులో వేల కోట్లు మింగి.. తెలంగాణను అప్పుల పాలు జేసిండు
- కేసీఆర్‌ను కట్టడి చేసే మొనగాడు సీఎం రేవంత్ ఒక్కడేనని కామెంట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమం ముసుగులో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రజల ఆస్తులను, వేల కోట్ల రూపాయలను నిలువునా దోచుకున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ధరావత్ రవీంద్రనాయక్ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాడు తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఉద్యమం కోసం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీ, సాగర్ సొసైటీ, పికెట్ సికింద్రాబాద్‌లలో తనకున్న 2,902 గజాల భూమిని అమ్ముకున్నానని రవీంద్రనాయక్ తెలిపారు. కానీ, పచ్చి అబద్ధాలకోరు, చీటర్ అయిన కేసీఆర్ మాత్రం ఉద్యమం పేరు చెప్పుకుని అసెంబ్లీ సాక్షిగా ఏకంగా 2,902 ఎకరాల పేదల భూములను, వేల కోట్ల ప్రజల సొమ్మును అక్రమంగా కొల్లగొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉండటానికి ఇల్లు లేదనడం పచ్చి బూటకం
తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు తనకు నివాసయోగ్యమైన ఇల్లు లేదని, కారు పార్కింగ్‌కు కూడా స్థలం లేదని చెప్పడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని రవీంద్ర నాయక్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పదేపదే గళం విప్పితే, కేసీఆర్ మాత్రం ఏనాడూ నోరు విప్పలేదని, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడబెట్టడానికే పరిమితమయ్యారని విమర్శించారు.
తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ఏపీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉంటూ పైరవీలు చేసుకునేవారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రికార్డులతో సహా కేసీఆర్ కుటుంబ దోపిడీని బట్టబయలు చేస్తే.. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు ఎదురుదాడికి దిగడం ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్న చందంగా ఉందని అన్నారు.
పాస్‌పోర్టులు రద్దు చేయాలి.. భూములు పేదలకివ్వాలి
తెలంగాణలో లూటీ చేసిన సొమ్ముతో కేసీఆర్ అండ్ కో విదేశాల్లో వేల ఎకరాల భూములు కొని, వేల కోట్ల నిధులు దాచుకున్నారని రవీంద్రనాయక్ ఆరోపించారు. వారు విదేశాలకు పారిపోకుండా వెంటనే పాస్‌పోర్టులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. గత పదేండ్లలో ధరణి పేరుతో కేసీఆర్ ముఠా అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ, సీలింగ్, కాందిశీకుల, సర్వోదయ భూములను లూటీ చేసిందని ఆరోపించారు. వీటన్నింటిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి, ఆ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. కేసీఆర్ అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వారు అక్రమంగా సంపాదించిన ధనబలంతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రమాదముందని హెచ్చరించారు. గతంలో తాను చెప్పినట్లే.. కేసీఆర్‌ను కట్టడి చేసే దమ్ము, ధైర్యం ఒక్క సీఎం రేవంత్‌రెడ్డికే ఉందని రవీంద్రనాయక్ స్పష్టం చేశారు.