Reading Time: < 1 minute
Ameesha Patel Criticizes Bollywood Actresses Takes Dig At Fake Stardom

Ameesha Patel: ‘కహో నా ప్యార్ హై’, ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ వంటి సినిమాలతో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న సీనియర్ నటి అమీషా పటేల్, నేటితరం బాలీవుడ్ హీరోయిన్ల నకిలీ స్టార్‌డమ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత సొమ్ముతో విలాసాలు అనుభవించే కొందరు నటీమణుల వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు, చివరకు వాళ్ళ సినిమాల మొదటి రోజు బాక్సాఫీస్ వసూళ్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో నెటిజన్లతో ముచ్చటిస్తూ ఆమె ఈ ఘాటు విమర్శలు చేశారు. చాలా మంది హీరోయిన్లు తాము పెద్ద స్టార్లమనే భ్రమల్లో బతుకుతున్నారని, సినిమా షూటింగ్‌లు, ప్రమోషన్ల సమయంలో ప్రొడ్యూసర్ల ఖర్చులతో వారు మెయింటెన్ చేసే పర్సనల్ అసిస్టెంట్లు, మేకప్ టీమ్‌ల ఖర్చులు నిర్మాతలకు పెద్ద శాపంగా మారుతున్నాయని అమీషా పేర్కొన్నారు. ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టకపోతే, తమ రోజువారీ జీవితంలో ఇంతమంది స్టాఫ్‌ను మెయింటెన్ చేయగలరా అని ప్రశ్నించారు.

కెరీర్‌లో కనీసం ఒక పెద్ద సోలో హిట్ లేని కొందరు హీరోయిన్లు, కేవలం డబ్బులిచ్చి పిఆర్ (PR) టీమ్స్ ద్వారా తామే నంబర్ 1 అంటూ ఫేక్ బిల్డప్ ఇచ్చుకుంటున్నారని తప్పుపట్టారు. ఇదే సెషన్‌లో తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, తాను ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ ఆఫర్లతో వచ్చే తక్కువ స్థాయి సినిమాల్లో లేదా పనికిరాని వెబ్ సిరీస్‌లలో నటించనని స్పష్టం చేశారు. కొన్ని ఏళ్లకు ఒకసారైనా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసే ‘గదర్ 2’ లాంటి కల్ట్ సినిమాలే చేస్తానని ఆమె తేల్చి చెప్పారు.  అమీషా పటేల్ 2000లో హృతిక్ రోషన్ సరసన ‘కహో నా ప్యార్ హై’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’, ‘హమ్‌రాజ్’, ‘భూల్ భులయ్యా’, ‘రేస్ 2’ వంటి సినిమాల్లో నటించారు. చాలా గ్యాప్ తరువాత 2023లో ‘గదర్ 2’తో సకీనా పాత్రలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ‘బద్రి’లో నటించిన ఆమెకు ఇక్కడ కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక అమీషా చేసిన తాజా వ్యాఖ్యలు బాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ వెనుక అసలు కథ, నిర్మాతలపై పెరుగుతున్న అదనపు ఖర్చుల భారం ఎంతవరకు సమంజసం అనే చర్చకు దారితీశాయి.