Reading Time: < 1 minute
Mumbai Garba Row Bjp Mla Sets Tilak And Worship Conditions For Muslim Attendees

Garba Row: ముంబైలో బోరివలిలో జరుగుతున్న భారీ గర్బా కార్యక్రమంలో ముస్లింల ప్రవేశంపై వివాదం నెలకొంది. కార్యక్రమానికి హాజరయ్యే ముస్లింలు తప్పనిసరిగా నుదిటిపై తిలకం ధరించి, దేవతలను పూజించాలని బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయ్ షరతులు పెట్టారు. ఆదివారం జరిగిన భూమి పూజ, ప్రెస్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే మనీషా చౌదరి, మాజీ ఎంపీ గోపాల్ శెట్టి కూడా హాజరయ్యారు.

ముస్లింల ప్రవేశం గురించి మాట్లాడిన సంజయ్ ఉపాధ్యాయ్.. ఈసారి గర్బాలో ముస్లంలకు ప్రవేశం ఉండదని, అయితే వారు హాజరుకావాలంటే భార్య, సోదరి, కుమార్తెతో కలిసి వచ్చి తిలకం ధరించి దేవతలను పూజించాలని అన్నారు. సనాతన ధర్మాన్ని విశ్వసించిన తర్వాతే రావాలని ఆయన వ్యాఖ్యానించారు. గర్బా కార్యక్రమొం ‘‘లవ్ జిహాద్’’కు వేదిక కాకూడదని అన్నారు.

మాజీ ఎంపీ గోపాల్ శెట్టి మాట్లాడుతూ.. ముస్లింలు తిలకం ధరించి వస్తే గర్బాలో పాల్గొనవచ్చని, హిందూ నేతలు ఈద్ వేడుకలకు వెళ్లే సమయంలో టోపీలు ధరిస్తారని, అదే విధంగా గర్బాకు రావాలనుకునే ముస్లింలు తిలకం ధరించడంలో ఇబ్బంది ఉండకూడదని అన్నారు. ముస్లింలు, క్రైస్తవుల పూర్వీకులు హిందువులేనని చెప్పారు.

గర్బా కార్యక్రమానికి హాజరయ్యేవారి ఆధార్ కార్డులు చెక్ చేస్తామని నిర్వాహకులు చెప్పారు. ఇప్పటికే మహారాష్ట్రలో దాండియా, గర్బాల్లోకి ముస్లింల ప్రవేశంపై వివాదం నెలకొంది. ఈ కార్యక్రమాల్లో ముస్లింలు ప్రవేశించడాన్ని అడ్డుకోవాలని వీహెచ్‌పీ పిలుపునిచ్చింది. హిందూ మతాచారాలను విశ్వసించని వారు గర్బా కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటారు? అని ప్రశ్నించారు. గర్బా పాటు, డ్యాన్స్ ఈవెంట్ కాదని దేవత ఆరాధనకు సంబంధించిన పండగ అని నిర్వాహకులు చెబుతున్నారు.