
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం పలువురు వీవీఐపీలకు నోటీసులు జారీ చేసింది. సర్ నోటీసులు అందుకున్న వారిలో కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ అతని భార్య క్యోకో ఎస్ జైశంకర్, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఆయన కుటుంబ సభ్యులు, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆయన భార్య, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ భార్య కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజనా దేశాయ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరంతా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదయ్యారు.
గత ఓటర్ జాబితా రికార్డులతో ప్రస్తుత ఓటర్ లిస్ట్ వివరాలు సరిపోలకపోవడంతో అన్-మ్యాపింగ్ కేటగిరీ కింద జైశంకర్, ఉపేంద్ర ద్వివేది కుటుంబాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ భార్య షేబా బ్రిటాస్, వారి కుమారుడు ఆనంద్ బ్రిటాస్‌లకు ఇతర కారణాలతో నోటీసులు జారీ చేశారు. షేబా పేరులో తేడా కారణంగా ఆమెకు నోటీసులు ఇవ్వగా.. ఆనంద్‌కు తల్లిదండ్రుల పేర్లలో తేడా కారణంగా నోటీసు అందింది.
ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌కు కూడా సర్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కేజీవాల్తో పాటు ఆయన భార్య సునీతా కేజీవాల్, కుమారుడు పుల్కిత్ కేజీవాల్, ఆయన తల్లిదండ్రులు గోవింద్ రామ్ కేజీవాల్, గీతా దేవిలకు కూడా అధికారులు నోటీసులు అందజేశారు. గత ఓటర్ జాబితా రికార్డులతో వీరి ప్రస్తుత వివరాలు సరిపోలకపోవడంతో అన్-మ్యాపింగ్ కేటగిరీ కింద ధృవీకరణ కోసం ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
కేజీవాల్ కుటుంబానికి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. కేజ్రీవాల్‌కు సర్ నోటీసులు ఇవ్వడంతో బీజేపీ, ఎన్నికల సంఘంపై ఆప్ ఫైర్ అయ్యింది. ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి నోటీసులు ఇవ్వడం ఏంటని మండిపడింది. బీజేపీ, ఈసీ కుమ్మక్కై ఢిల్లీలో భారీగా ఓట్ల తొలగింపుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జైశంకర్‌కు సర్ నోటీసులు అందడంతో ఆప్ పై బీజేపీ ఎదురుదాడి దిగింది.
ఈసీ ఎవరి చెప్పుచేతల్లో ఉండదని.. రాజకీయ స్వార్థం కోసమే ఎన్నికల సంఘంపై ఆప్ ఆరోపణలు చేస్తోందని కౌంటర్ ఇచ్చింది. సర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని.. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా నష్టపోకుండా ఉండేందుకే ఈసీ సర్ ప్రక్రియ చేపట్టిందని పేర్కొంది. నోటీసులు అందుకున్న వారు ఆధారాలు సమర్పించి తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపింది.