Reading Time: 2 minutes

గణేష్ మండపంలో అశ్లీల చిత్రాల వెబ్ సైట్ QR కోడ్.. ముగ్గురు అరెస్టు

Caption of Image.

ఎంతో పవిత్రంగా భావించి కొలుచుకునే వినాయక మండపంలో అశ్లీల చిత్రాలకు సంబంధించిన క్యూ ఆర్ కోడ్ కనిపించడం కలకలం రేపింది. అశ్లీల చిత్రాలకు లింక్ అయిన వెబ్ సైట్ క్యూఆర్ కోడ్ కనిపిండంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహారాష్ట్రలో 2026 సెప్టెంబర్ 18న వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివరాల్లోకి వెళ్తే..  మహారాష్ట్రలోని వాషిమ్ నగర్ లో  గణేశ్ మండపంలో  విగ్రహం పాదాల దగ్గర పోర్నోగ్రాఫిక్ వీడియోలకు లింక్ అయిన QR కోడ్ స్కానర్ ఉంచినట్లు బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి 19 నుంచి 20 ఏళ్ల వయసున్న  ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వాషిమ్ నగరంలోని కాలే ఫైల్ ప్రాంతంలోని జై భవానీ గణేశ్ ఉత్సవ్ మండల్‌ మండపంలో  ఘటన జరిగింది. సెప్టెంబర్ 18న మండల్ సభ్యులు గణేశ్ విగ్రహం పాదాల దగ్గర QR కోడ్ స్కానర్‌ను గమనించారు. దాన్ని స్కాన్ చేసినప్పుడు అది టెలిగ్రామ్ గ్రూప్‌కు దారి తీసింది. ఆ గ్రూప్‌లో అశ్లీల వీడియోల లింకులు ఉన్నట్లు గుర్తించారు. 

ఈ విషయం మండల్ సీనియర్ సభ్యుల దృష్టికి వచ్చిన తర్వాత వారు కూడా స్కాన్ చేసి అదే రకమైన కంటెంట్‌ను చూశారు. తర్వాత   వాషిమ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు.  

సెప్టెంబర్ 17న రాత్రి 11 గంటల ప్రాంతంలో రెండు బైకులపై ముగ్గురు వ్యక్తులు మండపం దగ్గరకు వచ్చినట్లు సీసీటీవీలో కనిపించింది. వారిలో ఒకరు గణేశ్ విగ్రహం దగ్గరకు వెళ్లి QR కోడ్ స్కానర్‌ను పాదాల దగ్గర ఉంచారు. మరొకరు తర్వాత వచ్చి దాన్ని చెక్ చేసినట్లు కనిపించింది.  

మండల్ అధ్యక్షుడు దుండగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.   సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు ముగ్గురు యువకులను గుర్తించారు. వారిని తన్మయ్ ముధాల్, యుగందర్ అఫునే, సుబోధ్ గా నిర్ధారించారు.

పోలీసులు  విచారించగా, డబ్బు సంపాదించడం కోసం ఈ QR కోడ్‌లను ఉంచినట్లు నిందితులు చెబుతున్నారు. ఎస్‌డీపీఓ రామేశ్వర్ పవార్ ప్రకారం, ఎవరైనా ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్‌కు వెళ్లి అశ్లీల వీడియోలు కనిపిస్తాయి. ప్రతి స్కాన్‌కు వారికి 10 నుంచి 15 రూపాయలు వచ్చేవి.

ఈ దుండగులు వాషిమ్ నగరంలోని హనుమాన్ ఆలయం, ఒక కాలేజీ బయట కూడా ఇలాంటి QR కోడ్ స్కానర్లను ఉంచినట్లు చెప్పారు. వాషిమ్ సిటీ పోలీసులు వీరి మీద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురినీ సోమవారం సాయంత్రం వరకు పోలీసు కస్టడీలో ఉంచాలని ఆదేశించింది.

పోలీసులు QR కోడ్‌లు ఎక్కడి నుంచి తెచ్చారు, చెల్లింపు వ్యవస్థ ఎలా పనిచేస్తోంది, నగరంలో మరెక్కడైనా ఇలాంటివి ఉంచారా అనే విషయాలపై దర్యాప్తుచేస్తున్నారు. ఇతర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.